news

బంగారం ఇలా కొంటె మీరు మోసపోతారు

ఇప్పుడు ప్రతి చిన్న టౌన్ కి కూడా కార్పొరేట్ గోల్డ్ షోరూంలు వచ్చేశాయి. ఒకడు క్లియర్ ప్రైస్ టాగ్ అంటాడు.. ఇంకొకడేమో ఎటువంటి తరుగులేదు అంటాడు.. అయినా చివరకు వచ్చేసరికి కొనుగోలుదారుకి ఏదో ఒక రూపంలో టోపీ వేస్తుంటారు. అందుకే బంగారం కొనే సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా లేకుంటే ఖచ్చితంగా మోసపోయినట్లే.. బంగారం తూకంలో, నాణ్యతలో తేడాలు ఉంటాయి. కొనుగోలు చేసిన దానిని అవసరాలకు తిరిగి అమ్మే సమయంలో కాని మోసపోయినట్లు తెలీదు. అందుకే కొనుగోలు సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

* బంగారం కొనే ముందు 22 క్యారెట్లకు, 24 క్యారెట్ల బంగారానికి మధ్య తేడా తెలుసుకోవాలి. 24 క్యారెట్లలో 99 శాతం బంగారం, మిగతా ఒక శాతం వెండి, రాగి మిశ్రమం ఉంటుంది. అదే 22 క్యారెట్లలో 92 శాతం బంగారం, మిగతా ఎనిమిది శాతం వెండి, రాగి మిశ్రమం ఉంటుంది. బంగారం ధర నిర్ణయంలో ఈ మిశ్రమాల వెయిట్ ను తొలగించాలి. లేకుంటే 1తులం బంగారానికి కనీసం 2వేల రూపాయలు మోసపోయే ప్రమాదం ఉంది.

బంగారు ఆభరణాలు చేసేప్పుడు వెండి, రాగి, నికిల్‌, జింక్‌ లోహాల మిశ్రమం వాడితేనే ఎంతో మన్నిక కలిగి ఉంటాయి. వీటి పాత్ర కీలకమే అయినా పసిడి స్వచ్ఛత (అంటే ఎంత శాతం లేదా ఎన్ని క్యారెట్లు బంగారం వాడారు)ను బట్టి మాత్రమే దాని ధర నిర్ణయమవుతుంది. కాని ఆ విషయం తెలియక మొత్తం వెయిట్ కు బిల్లు చెల్లించి మోసపోతుంటారు.
* ధర నిర్ణయంలో పసిడి స్వచ్ఛతతోపాటు మేకింగ్‌ చార్జీలు ఉంటాయి. వీటిని ఇష్టమొచ్చినట్లు వసూలు చేస్తారు. దీనిపై జాగ్రత్తలు తీసుకోకుంటే 1తులానికి రూ.500-1000 వరకు ఎక్కువగా వసూలు చేస్తారు.
* ఇక బంగారం స్వచ్ఛతను గీటురాయితో తెలుసుకోవచ్చు. రాగి ఎక్కువగా ఉంటే గీసినపుడు గీత రాగి రంగులోకి వస్తుంది. దానిపై యాసిడ్‌పోస్తే, రాగిని యాసిడ్‌ కరిగిస్తుంది. అదే బంగారంపై యాసిడ్‌ పోస్తే, బంగారు వర్ణం వస్తుంది. దీంతో ఆ బంగారంలో కల్తీని సులభంగా గుర్తించవచ్చు.
* శబ్దాన్ని బట్టి కూడా బంగారం స్వచ్ఛత కనుక్కొనవచ్చు. కాయిన్స్‌ని పైకి ఎగురవేసినప్పుడు ఖంగుమనే శబ్దం వస్తే అది 22 క్యారెట్ల బంగారం. అదే మెత్తని శబ్దం వస్తే అది 24 క్యారెట్లని అర్థం.. అయితే ఇవన్నీ పాతకాలం పద్ధతులు.
* ఇప్పుడు స్వచ్చతను హాల్‌ మార్కింగ్‌ ద్వారా నిర్ణయిస్తున్నారు. హాల్‌మార్క్‌ గుర్తు ఉన్న బంగారాన్ని అమ్మితే, దాని విలువకు సమానంగా బంగారం రావాలి. అలా షాపు వారు ఇవ్వకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. అందుకే కొన్న వెంటనే హాల్‌మార్కింగ్‌ చేయించుకోవాలి.

* ఉదాహరణకు చెవి రింగుల జత తీసుకున్నారనుకోండి అందులో ఒక దానికి హాల్ మార్క్ ఇచ్చి, ఇంకొక దానికి ఇవ్వకుండా కూడా మోసగిస్తారు.
* చాలా మందికి తెలియని విషయం బంగారానికి బీమా సౌకర్యం కూడా ఉంటుంది. కొనేటప్పుడు తప్పనిసరిగా వ్యాట్‌ రసీదు తీసుకోవాలి. షాపు యజమానులు మన వద్ద వ్యాట్ ట్యాక్స్ తీసుకుని కూడా మనకు రశీదు ఇవ్వరు.
* రశీదు దగ్గర పెట్టుకుంటే మీ బంగారానికి బీమా సౌకర్యం లభిస్తుంది. ఈ రశీదు తీసుకుంటే మీరు కొన్న బంగారం నిజమైన బంగారం అని అర్ధం.

Comments

comments