news

డిసెంబర్ 31 నుండి చెక్ బుక్ లు చెల్లవు!!

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాలో విలీనమైన ఆరుబ్యాంకుల చెందిన ఖాతాదారులు ఇంకా పాత చెక్ బుక్ లు, ఐఎఫ్ఎస్సీ కోడ్ లనే వాడుతున్నారా? అయితే వీలైనంత త్వరగా వాటిని మార్చేసుకోమని సలహా ఇస్తున్న స్టేట్ బ్యాంక్ అధికారులు.. 2017 డిసెంబర్‌ 31 నుంచి ఎస్‌బీఐ తన విలీనం చేసుకున్న ఆరు బ్యాంకుల ఖాతాదారులకు చెందిన పాత చెక్‌బుక్‌లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు చెల్లవు. ఈ లోపలే కొత్త చెక్‌బుక్‌లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు తీసుకోవాలని ఎస్‌బీఐ తన ఖాతాదారులకు తెలిపింది. ఖాతాదారుల వద్ద ఉన్న పాత చెక్‌బుక్‌లను మార్చుకోవడానికి 2017 సెప్టెంబర్‌ 30న డెడ్‌లైన్‌గా గడువు విధించింది. అనంతరం ఆ గడువును డిసెంబర్‌ 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఎస్‌బీఐ మరోసారి తన కస్టమర్లకు ఈ సూచన చేస్తోంది.

2017 ఆరంభంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనేర్‌ అండ్‌ జైపూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ రాయ్‌పూర్‌ సహా భారతీయ మహిళా బ్యాంకులు ఎస్బీఐలో విలీనమైన విషయం తెలిసిందే. ఖాతా దారులు కొత్త చెక్‌బుక్‌ తీసుకోవడానికి బ్యాంకు శాఖనైనా లేదా ఎటీఎం, ఎస్‌బీఐ మొబైల్‌ యాప్‌ ద్వారానైనా దీన్ని పొందవచ్చు. ఎస్‌బీఐ కూడా మేజర్‌ సిటీల్లో ఉన్న బ్రాంచు పేర్లను, బ్రాంచు కోడ్‌లను, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను మారుస్తోంది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కత్తా, పాట్న, అహ్మదాబాద్‌, భోపాల్‌, అమరావతి, చంఢీగర్‌, జైపూర్‌, తిరువనంతపురం, లక్నో వంటి నగరాల్లో ఎస్‌బీఐ బ్రాంచు పేర్లను, బ్రాంచు కోడ్లను, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్లను మార్చేసింది. కోడ్స్ మారుతుండటం వలన ఖాతాదారులు బ్యాంకులో తమ కొత్త చెక్ బుక్ తీసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. ఇదిలా ఉండగా….

డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే నల్లధనం వెనక్కి రప్పించే పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసిన మోడీ సర్కారు… తాజాగా చెక్ బుక్‌ లను రద్దు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కావాల్సిన నగదు చెలామణిలో ఉంది. దాంతో పెద్ద నోట్ల రద్దు సమయంలో ఉన్నంతగా డిజిటల్ లావాదేవీలు జరగడం లేదు. వాటిని పెంచేందుకు చెక్ బుక్ లను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. చెక్ బుక్ లను రద్దు చేస్తే… డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతుందని బ్యాంకింగ్ నిపుణుల అంచనాగా ఉంది.

చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల చెల్లింపుల్లో చెక్కులదే అధిక వాటా. వస్తువుల డెలివరీ, సరఫరాలు.. వ్యాపారులు, కస్టమర్లిచ్చే చెక్కులపైనే ఆధారపడి ఉంటాయి. కావాల్సిన తేదీకి చెల్లుబాటు అయ్యే వెసులుబాటు చెక్కుల్లో ఉండటంతో లావాదేవీల్లో వీటినే ఎక్కువగా వాడుతున్నారు. సరుకు అందనిపక్షంలో చెక్కులను నిలుపుదల చేసుకునే వీలు కూడా ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలోనూ చెక్కులకు డిమాండ్ ఎక్కువే. భూములు, ఇండ్ల క్రయవిక్రయాల్లో అధికులు చెక్కులకే ప్రాధాన్యతనిస్తున్నారు. నిజంగానే కేంద్రం చెక్‌ బుక్ లను రద్దు చేస్తే… చిరు వ్యాపారుల నుంచి బడా పారిశ్రామిక వేత్తల వరకూ దీని ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా సరుకు రవాణా ఎక్కడిక్కడ నిలిచిపోయే ప్రమాదముంది.

డిజిటల్ ట్రాన్సాక్షన్ల విషయంలో ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. అందుకే వ్యాపారులు చెక్‌ లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం ఒక్కసారిగా చెక్ లను రద్దు చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే చాలా వరకు పోస్ట్ డేటెడ్ చెక్ లు ఉంటాయి కాబట్టి, క్రమంగా చెక్‌ ల వినియోగాన్ని తగ్గించుకుంటూ వచ్చే ఛాన్స్ ఉంది.

Comments

comments