news

అండాలను దాచుకోండి..ఎప్పుడైనా పిల్లల్ని కనండి..!

అప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నారా..? ఉద్యోగమో, వ్యాపారమో, కారణమేదైనా ఇంకొన్నేళ్ల పాటు పిల్లల్ని కనే ఆలోచన లేని వాళ్లకు, సరికొత్త మార్గం దొరికింది. నేటి సమాజంలో చాలా మంది మహిళలు ముప్ఫై ఏళ్లు దాటేవరకూ పిల్లల్ని కనే ఆలోచన చేయట్లేదు. కానీ వయసు ముదిరితే, అండాల నాణ్యత తగ్గిపోతుంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి అనే వారికి దొరికిన సొల్యూషన్ ఎగ్‌-ఫ్రీజింగ్‌ టెక్నాలజీ.

దీని ద్వారా, మంచి వయసులో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మహిళలో విడుదలయ్యే అండాన్ని తీసి భద్రపరుస్తారు. ఆ తర్వాత ఎంత కాలం తర్వాతైనా సరే, ఆమెకు బిడ్డ కావాలనుకున్నప్పుడు వస్తే, తిరిగా ఆమె దాచుకున్న ఆరోగ్యకరమైన అండాన్ని ఆమెలో ప్రవేశపెడతారు. ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నిక్ ను ఇప్పుడు వేలాది మంది అనుసరిస్తుండటం విశేషం. విశ్వసుందరిగా ఎన్నికైన డయానా హెడెన్, చాలా ఏళ్ల పాటు తన కెరీర్ తో తీరిక లేని సమయం గడిపింది. ఇప్పుడు 44 ఏళ్ల వయసులో, తను ఒకప్పుడు భద్రపరుచుకున్న తన అండాలనే ఉపయోగించుకుని పిల్లల్ని కనబోతోంది. ముంబైలోని ఒక ఆస్పత్రిలోనే వేలాది మంది మహిళలు తమ అండాల్ని భద్రపరుచుకోవడం విశేషం. ఇలా చేయడానికి రూ. 50 వేలు కట్టించుకుంటారు.

అయితే, ఈ ఎగ్ ఫ్రీజింగ్ టెక్నిక్ కు కొన్ని నిబంధనలున్నాయి.
పూర్తి ఆరోగ్యంతో, ముప్ఫై ఏళ్ల లోపుగానే అండాల్ని భద్రపరుచుకోవాలి. తప్పదు అనుకుంటే 38 ఏళ్ల వరకూ సమయం ఉంటుంది. ఇక ఆ వయసు దాటిన వారికి మాత్రం అండాల్ని తీసుకోరు.

ఎగ్ ఫ్రీజింగ్ లో అండాలు ఉత్పత్తి అవడం కోసం 10 నుంచి 14 రోజుల పాటు ప్రతీరోజూ హార్మోన్ ఇంజక్షన్స్ ఇస్తారు. దాంతో అండం పరిపక్వం చెందగానే, యోని మార్గం ద్వారా సేకరించి, భద్రపరుస్తారు. సేకరించిన ద్రవరూప అండాన్ని ఘనీభవింపజేసి, మైనస్‌ 196 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరుస్తారు.

మహిళ తాను గర్భం దాల్చడానికి సిద్ధమైనప్పుడు, ఈ అండాలను కరిగించి, ఆమె భర్త లేదా భాగస్వామి వీర్యకణంతో ఫలదీకరణ చేస్తారు. ఆ అండాలను గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ప్రతీ పది అండాల్లో, కనీసం 5 లేదా ఆరు అండాలు సక్సెస్ ఫుల్ గా ఫలదీకరణ చెందుతాయని డాక్టర్లు చెబుతున్నారు.

పని, జీవితం, బాధ్యతలు ముఖ్యంగా మారిపోయిన నేటి రోజుల్లో, స్త్రీలకు ఇది చాలా ఉపయోగకరమైన టెక్నాలజీ అనే చెప్పాలి. అయితే, సహజసిద్ధంగా తల్లి అయ్యేలా ప్రకృతి ప్రసాదించిన వరానికి మాత్రం, మరే టెక్నాలజీ సాటి రాలేదనేది వాస్తవం.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment