Business

అధార్ కార్డు ఉంటె డబ్బులు తీసుకోవచ్ఛా?

ఆధార్ తోనే ఏటీఎంలు

ఆధార్‌తో అనుసంధానం కానున్నాయి ఆటోమేటిక్‌ టెల్లర్‌ మిషన్లు (ఏటీఎం). బ్యాంకు ఖాతాతో ఆధార్‌ అనుసంధానమై ఉంటుంది గనక నేరుగా ఎలాంటి కార్డు అవసరం లేకుండానే వేలిముద్రతో నగదు ఉప సంహరణ, నగదు బదిలీ వంటి సేవలన్నీ వినియోగించుకోవచ్చు. ఆధార్‌ అనుసంధానమైన ఏటీఎంలను ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ సంస్థ హైదరాబాద్‌లోని పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రంలో (ఆర్‌అండ్‌డీ) అభివృద్ధి చేస్తోంది. దీంతో పాటు ఇంటరాక్టివ్‌ టెల్లర్‌ మిషన్స్‌ (ఐటీఎం), క్యాష్‌ రీసైక్లింగ్‌ మిషన్స్‌(సీఆర్‌ఎం) రూపొందించామని తెలిపారు ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ హైదరాబాద్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ నల్లం. వీడియో, టెలికాలర్‌ సేవలతో కూడిన ఇంటరాక్టివ్‌ టెల్లర్‌ మిషన్‌లను (ఐటీఎం) అభివృద్ధి చేశామన్నారు ఆయన. 90 శాతం బ్యాంకు సేవలు ఐటీఎంతోనే నిర్వహించుకోవచ్చునంటున్నాడాయన. అంటే నగదు ఉపసంహరణ నుంచి మొదలుపెడితే నగదు బదిలీ, రుణాల దరఖాస్తు, స్టేట్‌మెంట్‌ ముద్రణ, ఖాతా ప్రారంభం, చెక్‌ నిర్వహణ, కే వైసీ వంటి సేవలన్నీ పొందొచ్చనని చెప్పారు అశోక్. ఐటీఎం పైలట్‌ ప్రాజెక్ట్‌ను ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌తో కలిసి గుర్గావ్‌లో నిర్వహిస్తున్నామన్నారు.

సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి హైదరాబాద్‌లో; తయారీ మాత్రం చెన్నైలో

హైదరాబాద్‌లోని ప్రధాన బ్యాంకులతోనూ చర్చలు జరిపామన్నారు అశోక్ నల్లం. ఆయా ఐటీఎంల పనితీరు, టెక్నాలజీలను బ్యాంకులు పరిశీలిస్తున్నాయి. 2018 తొలి త్రైమాసికంలో ఐటీఎంలు మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. ఐటీఎం సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి హైదరాబాద్‌లో, తయారీ మాత్రం చెన్నైలోని ప్లాంట్‌లో జరుగుతుందన్నారు ఆయన. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో నిరక్షరాస్యులు ఐటీఎం వాడుకునేందుకు వీలుగా వీడియో, టెలికాలర్‌ సేవలుంటాయన్నారు. ఉదాహరణకు ఐటీఎంలోకి ప్రవేశించగానే సెన్సార్ల ద్వారా పసిగట్టి.. నిర్వహణ ఎంపికలను సూచిస్తుంది. తద్వారా కస్టమర్‌ ఐటీఎం సేవలను సులువుగా నిర్వహించుకునే వీలుంటుందన్నారు అశోక్.

ఏపీ, తెలంగాణలో 8 వేల ఏటీఎంలు..

దేశీయ ఏటీఎం పరిశ్రమలో ఎన్‌సీఆర్‌ వాటా 48 శాతం. ప్రస్తుతం దేశంలో 2.10 లక్షల ఏటీఎంలుండగా.. ఇందులో 1.5 లక్షల ఏటీఎంలు ఎన్‌సీఆర్‌వే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 8 వేల ఏటీఎంలున్నాయి. ఇందులో 4 వేలు హైదరాబాద్‌లో ఉంటాయి. ప్రస్తుతం ఎన్‌సీఆర్‌కు దేశంలో 3,500 మంది నిపుణులున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏటీఎంలు 8–10 ఏళ్ల క్రితం నాటివి. వీటి స్థానంలో కొత్త టెక్నాలజీతో కూడిన ఏటీఎంలను ఏర్పాటు చేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గతంలోనే ప్రకటించింది.

మైండ్‌స్పేస్‌లో ఆర్‌అండ్‌డీ సెంటర్‌..

బేగంపేట కేంద్రంగా 2004లో 50 మందితో ప్రారంభమైన ఎన్‌సీఆర్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను మంగళవారం రహేజా మైండ్‌స్పేస్‌కు తరలించారు. ఎన్‌సీఆర్‌కు అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్‌అండ్‌డీ సెంటర్‌ ఇదే. 1.40 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ కేంద్రంలో ఐటీఎం, ఈఎంవీ కాంటాక్ట్‌లెస్‌ ఏటీఎం, మొబైల్‌ పేమెంట్‌ సొల్యూషన్స్, రిటైల్‌ సెల్ఫ్‌ చెక్‌ ఔట్స్‌ వంటి వాటికి సాఫ్ట్‌వేర్‌లను అభివృద్ధి చేస్తుంది. ఎన్‌సీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా 8 వేల మంది సాంకేతిక నిపుణులుండగా.. ఒక్క హైదరాబాద్‌ ఆర్‌అండ్‌డీలోనే 1,200 మంది నిపుణులున్నారు.

విస్తరించిన ఫిన్‌టెక్‌ స్టార్టప్స్‌ సేవలు

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగాల్లో ఫిన్‌టెక్‌ స్టార్టప్స్‌ సేవలు విస్తరించాయన్నారు ఎన్‌సీఆర్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పౌల్‌ లాంగెన్‌బాన్‌. ఆయా స్టార్టప్స్‌ ఏటీఎం తయారీ సంస్థలకు సవాల్‌ విసురుతున్నాయని, మరీ ముఖ్యంగా రిటైల్‌ విభాగంలో అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేసెస్‌ (ఏపీఐ) టెక్నాలజీలో సవాల్‌గా మారాయని ఆయన పేర్కొన్నారు. గతేడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏటీఎం మార్కెట్‌ 0.16 శాతం తగ్గింది. ఇండియా విషయానికొస్తే.. పెద్ద నోట్ల రద్దుకు ముందు ఏడాదికి 25 వేల ఏటీఎంలను అభివృద్ధి చేసేవాళ్లం. కానీ, నోట్ల రద్దు తర్వాత 17 వేల ఏటీఎంలకే పరిమితమయ్యాం. 2015–16లో 15 శాతం వృద్ధిని సాధించాం. కానీ, పెద్ద నోట్ల రద్దు తర్వాత మా వ్యాపారం 8–10 శాతం తగ్గిందన్నారు పౌల్‌. అనంతరం ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ సీటీవో ఎలీ రోజ్నర్‌ మాట్లాడుతూ.. ఎన్‌సీఆర్‌ చెన్నై ప్లాంట్‌లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌), ఏటీఎంలు తయారవుతాయి. ఏటా ఇక్కడ 2 లక్షల ఏటీఎంలు తయారవుతాయని, ఇందులో 70 శాతం ఎగుమతులు, 30 శాతం దేశీయ వాటా ఉంటుంది. మధ్యప్రాచ్య, ఇతర ఆసియా దేశాలకు ఎగుమతి అవుతుంటాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 2016లో ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ ఆదాయం 6.5 బిలియన్‌ డాలర్లు. ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ల లావాదేవీలు జరుగుతుంటాయి.

Comments

comments