news

కొండెక్కిన కోడి గుడ్డు!

కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చుంటే.. నేనమ్మా తక్కువా అంటూ కోడి గుడ్డు ధరలు గుండె గుబేలుమనిపిస్తున్నాయి.  ఏకంగా కోడి గుడ్డు ధరలు 40 శాతం మేర పెరిగాయి. నిన్న మొన్నటి దాకా రూ.4 ఉన్న కోడి గుడ్డు ధరలు, నేడు ఏకంగా రూ.7 నుంచి రూ.7.50గా పలుకుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం సరఫరా తగ్గిపోవడమేనని, మరోవైపు జీఎస్టీ రేట్లు పెరగడంతో ఫౌల్ట్రీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ రమేష్‌ కాత్రి చెప్పారు. వచ్చే నెలల్లో కూడా కోడి గుడ్డు ధరలు మరింత పెరగనున్నట్టు పేర్కొన్నారు. గుడ్ల ఉత్పత్తి ఈ  ఏడాదిలో 25-30 శాతం తగ్గిపోనుందని చెప్పారు. గతేడాది సరియైన రేట్లు లభించకపోవడంతో చాలా ఫౌల్ట్రీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించాయని, దీంతో ఈ ఏడాది రేట్లు ఎగిశాయని తెలిపారు. 2016-17లో హోల్‌సేల్‌గా గుడ్డు ధరలు రూ.4 కంటే తక్కువగానే ఉండేవి.

ప్రతి రోజూ గుడ్డు తినడం వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. చౌక ధరలో అందుబాటులో ఉండటంతో సామాన్యులు ఎక్కువగా గుడ్డు తినేందుకు మొగ్గు చూపుతారు. కానీ కొద్ది కాలంగా గుడ్డు ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో గుడ్డు కంటే చికెన్ బెటర్ అనిపిస్తోంది. కూరగాయల ధరలు పెరిగిన ప్రభావం గుడ్లపై కూడా పడింది. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు దాదాపు రూ.7 పలుకుతోంది. విజయవాడ, విశాఖ నగరాల్లో వంద గుడ్ల ధర రూ. 532 పలుకుతుండగా.. హైదరాబాద్‌లో రూ. 535 పలుకుతోంది. ముంబై, పుణే లాంటి నగరాల్లోనైతే వంద గుడ్ల ధర ఏకంగా రూ. 585 వరకు చేరింది.

ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ వంద గుడ్ల ధర రూ. 110కి పైగా పెరగడం గమనార్హం. హోల్‌సేల్‌గా గుడ్ల రేట్లు భారీగా పెరగడంతో.. రిటైల్‌గా కొన్ని చోట్ల రూ. 6.5 నుంచి రూ.7.5 వరకు విక్రయిస్తున్నారు. ఒక్కో గుడ్డు సగటున 55 గ్రాములు ఉంటుంది అనుకుంటే.. కిలో బరువు తూగడానికి రూ. 120-135 వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. రూ. 130- 150 పెడితే స్కిన్‌లెస్ చికెన్ కిలో వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో వంద గుడ్ల ధర సగటున రూ. 333 పలకగా అది క్రమంగా పెరుగుతూ.. రూ. 532 దాటింది. ఈ స్థాయిలో గుడ్ల ధరలు పెరగడం గతంలో ఎన్నడూ చూడలేదని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు.

గతేడాది రేట్లు తగ్గిపోవడంతో వచ్చిన నష్టాల మేరకు ఫౌల్ట్రీ సంస్థలు తమ ఉత్పత్తిని తగ్గించాయని కాత్రి వివరించారు. మరోవైపు కోడి గుడ్ల ధర పెరగడంతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని హోల్‌సేల్‌ వ్యాపారులు వాపోతున్నారు. అంతేకాక ఇటు పెరిగిన గుడ్ల ధరలకు వినియోగదారులు కూడా తట్టుకోలేకపోతున్నారు. నవంబర్‌, డిసెంబర్‌, జనవరి కాలంలో ఉత్తర భారతంలో వినియోగం పెరిగి రేట్లు పెరుగుతాయని నేషనల్‌ ఎగ్‌ కో ఆర్డినేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుబ్బరాజు తెలిపారు. దేశ రాజధాని రిటైల్‌ మార్కెట్లలో కోడి గుడ్ల ధరలు ఒక్కోటి రూ.7 నుంచి రూ.7.50 మధ్యలో పలుకుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

నవంబర్, డిసెంబర్, జనవరి కాలంలో ఉత్తర భారతంలో వినియోగం పెరిగి రేట్లు పెరుగుతాయని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరాజు తెలిపారు. దేశ రాజధాని రిటైల్ మార్కెట్లలో కోడి గుడ్ల ధరలు ఒక్కోటి రూ.7 నుంచి రూ.7.50 మధ్యలో పలుకుతున్నాయి.

రూ.6 వద్దే ఆపండి..
కోడిగుడ్ల ధర పెరిగిపోతుండడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది. గుడ్డు ధర పెరుగుదలపై పరిమితి విధించాలని, ఒక్కోటీ రూ.6 లకు అమ్మాలంటూ రాష్ట్ర ఫౌల్ట్రీ ఫౌండేషన్‌కు సూచించింది. ప్రభుత్వం సూచించిన పరిమితికి మించి ధరను పెంచితే కఠిన చర్యలు తప్పవని జంతు వనరుల అభివృద్ధి శాఖ హెచ్చరించింది. ఫౌల్ట్రీ పరిశ్రమకు అందిస్తున్న రాయితీలపై కోత లేదా రద్దు చేసే అవకాశమూ లేకపోలేదని శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

కార్తీక మాసంలో తెలుగు ప్రజలు నాన్ వెజ్ తినరు. ఇప్పుడు కార్తీక మాసం ముగియడంతో గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment