news

అన్ని మాటలు చెప్పి.. వీళ్లు ఓటు వేయలేదట!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని ఇద్దరు సెలబ్రిటీలు వార్తల్లోకి వచ్చారు. వారే నటుడు ప్రకాష్ రాజ్, నటి రమ్య. వీరిలో రమ్య కాంగ్రెస్ పార్టీ నేత. ఆ పార్టీ మాజీ ఎంపీ కూడా. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈమె ప్రచారం చేసింది. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరింది. అలాగే రాహుల్ గాంధీ టీమ్ లో మెంబర్‌గా కూడా ఉంది రమ్య. ఈ హోదాలో భారతీయ జనతా పార్టీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కూడా ఉంటుంది. ఇలాంటి నేపథ్యం ఉన్న రమ్య కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకోలేదు!

ఇక ప్రకాష్ రాజ్.. ఈయన సంగతి చెప్పనక్కర్లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ కావడం లేదు కానీ, చాలా రాజకీయాలే చేస్తున్నాడు. కేసీఆర్‌ను తీసుకెళ్లి జేడీఎస్ వాళ్లతో సమావేశ పరచడం, అలాగే డీఎంకే వాళ్లతో సమావేశ పరచడం.. ఇలాంటి పనులు చేశాడు ప్రకాష్ రాజ్. అలాగే కర్ణాటక రాజకీయాలపై కూడా తనదైన శైలిలో అభిప్రాయాలు చెబుతూ వచ్చాడు. ప్రధానంగా బీజేపీపై విరుచుకుపడుతూ వచ్చాడు. తన హాట్ కామెంట్స్‌తో అనునిత్యం పొలిటికల్ న్యూస్లో నిలిచాడు ప్రకాష్ రాజ్.

కట్ చేస్తే.. ఈ ఇద్దరు ప్రముఖులూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేదు. మండ్యాలో ఓటు హక్కును కలిగిన రమ్య ఓటు వేయలేదు. ప్రచారం అయితే చేసింది కానీ ఈమె తమ పార్టీ అభ్యర్థికి ఓటేయడానికి కూడా వెళ్లలేదు.

ఇక ప్రకాష్ రాజ్ ది వేరే కథ. ఇతడికి కర్ణాటకలో ఓటు హక్కు లేదట. ఇతడి ఓటు తమిళనాట, చెన్నైలో ఉందట. దీంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇతడు ఓటేయలేకపోయినట్టుగా తెలుస్తోంది. ఇలా రాజకీయ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచి తీరా ఓటు హక్కును వినియోగించుకోకపోవడంతో వీరిపై విమర్శల వాన కురుస్తోంది.

Comments

comments