news

దేశంలో ఎక్కడికైనా కేవలం ఒకే ఒక్క రూపాయి కే విమాన ప్రయాణం

దేశంలో చౌక విమానయాన సేవలకు శ్రీకారం చుట్టిన తొలి సంస్థగా పేరున్న ఎయిర్‌ డెక్కన్‌.. ఈ నెల 22న దేశీయ ఎయిర్‌లైన్‌ మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వనుంది. గతంలో రూపాయికే విమాన టికెట్‌ అందించడం ద్వారా సామాన్యుల్లో సైతం విమానయానంపై ఆసక్తి పెంచిన సంస్థ.. మళ్లీ అదే ఆఫర్‌తో తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్నది. ఉడాన్‌ పథకంలో భాగంగా సేవలందించేందుకు ముందుకు వస్తున్న ఎయిర్‌ డెక్కన్‌.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, షిల్లాంగ్‌లను దగ్గర్లోని చిన్న నగరాలతో కనెక్ట్‌ చేసేలా విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నది.

తొలి విమానం నాసిక్‌లో టేకాఫ్‌ తీసుకొని ముంబైలో ల్యాండ్‌కానుంది. ఉడాన్‌ పథకంలో భాగంగా మార్చిలో 128 మార్గాల్లో విమాన సేవలందించేందుకు బిడ్డింగ్‌ జరిగింది. అందులో ఎయిర్‌ డెక్కన్‌ 38 రూట్లను దక్కించుకుంది.

ఎయిర్‌ డెక్కన్‌ను కెప్టెన్‌ గోపీనాథ్‌ 2003లో ప్రారంభించారు. 2008లో ఈ సంస్థ విజయ్‌మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో విలీనమైంది. ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌.. 2012లో సర్వీసులు నిలిపివేసింది. 2006లో ఎయిర్‌ డెక్కన్‌ ప్రకటించిన రూపాయికే విమాన టిక్కెట్‌ ఆఫర్‌ సంచలనం సృష్టించింది.

దాంతో టికెట్లు కొనుగోలు చేసేందుకు అప్పట్లో సంస్థ కౌంటర్ల వద్ద వందల సంఖ్యలో జనాలు బారులు తీరారు. ఈ ఆఫర్‌కు కస్టమర్ల నుంచి లభించిన అపూర్వ స్పందన దేశీయ విమానయాన రంగంలో చౌక విమానయాన సేవలకు బాటలు వేసింది. చౌకగా సేవలందించేందుకు 2005 నుంచి 2007 మధ్యకాలంలో విమాన రంగంలోకి అడుగుపెట్టిన ఇండిగో, స్పైస్‌జెట్‌, గోఎయిర్‌, జెట్‌లైట్‌ సంస్థలకు ఎయిర్‌ డెక్కనే ఆదర్శమని చెప్పవచ్చు.

Comments

comments

Recent Posts