movies

శ్రీదేవిని మరిపిస్తుందా – ట్రైలర్ రివ్యూ

జాన్వీ కపూర్ తెరముందుకు వచ్చేసింది. థియేటర్లో చూడడానికి ఇంకా  40 రోజుల టైం ఉంది కానీ ఈ లోపు తాను ఎలా ఉంటుందో కనిపించడానికి  చిన్న శాంపిల్ రూపంలో ధఢక్  ట్రైలర్ వచ్చేసింది. అందాల తార శ్రీదేవితో టాలీవుడ్ కు సైతం చాలా బాండింగ్ ఉంది కాబట్టి ఈ సినిమా మీద ఇక్కడ కూడా ఆసక్తి నెలకొంది. కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు శశాంక్ ఖైతాన్.

జాన్వీ కపూర్ తో పాటు ఇషాన్ ఇందులో హీరోగా పరిచయమవుతున్నాడు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నప్పటికీ అందరి చూపు మాత్రం జాన్వీ కపూర్ మీదే ఉంది. అందం విషయంలో అమ్మను మరిపిస్తుందా అనే సందేహం అయితే లేకపోలేదు. వాటికి చెక్ పెడుతూ ధడక్ లో జాన్వీ ఏ మాత్రం బెరుకు లేకుండా నటించింది. అది  స్పష్టంగా కనిపిస్తోంది.

టీనేజ్ లవ్ స్టోరీ నేపధ్యంగా తీసుకున్న ఈ కథలో ఇషాన్ బాగానే  చేసినప్పటికీ జాన్వీనే  మొత్తం డామినేట్ చేసింది. కొన్ని చోట్ల చాలా క్యూట్ గా ఉన్నా ఫైనల్ శ్రీదేవిని తలదన్నే అందం అయితే జాన్వీది కాదు. పోను పోను సినిమాలు చేసే కొద్దీ ఫిజిక్ తో మొహంలో మార్పులు రావచ్చు గాని మొత్తానికి జూనియర్ అతిలోకసుందరి ఫీచర్స్ అయితే ప్రస్తుతానికి లేవు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇది మరాఠి బ్లాక్ బస్టర్ సైరాట్ కు ప్యూర్ రీమేక్. నేటివిటీ విషయంలో కానీ కథ విషయంలో కానీ దాన్ని ఉన్నది ఉన్నట్టు ఫాలో అయిపోయారు. ఒక వెనుకబడిన వర్గానికి చెందిన కాలేజీ కుర్రాడు బాగా డబ్బున్న రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబంలోని అమ్మాయిని ప్రేమిస్తే దాని తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయన్నదే ధడఖ్ స్టోరీ. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో ఎమోషన్స్ ని ప్రెజెంట్ చేసే విషయంలో జాన్వీలో చాలా మెచ్యూరిటీ చూపించింది.

ఇషాన్ ని పోలీస్ వ్యాన్ లో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నప్పుడు తనను తాను కాల్చుకుని చనిపోతాను అనే సీన్ లో ది బెస్ట్ ఇచ్చేసింది. ఇషాన్ ని ఆటపట్టించే సీన్స్ లో మంచి ఫన్ చూపించింది. కాకపోతే పదహారేళ్ళ వయసులో శ్రీదేవి అంత ఛార్మ్ ఊహించుకోకుండా చూస్తే జాన్వీ కపూర్ హీరొయిన్ గా స్థిరపడే ఛాన్స్ ఉంది. జులై 20న విడుదల కానున్న ధడక్ ఒరిజినల్ వెర్షన్ లో యాంటీ క్లైమాక్స్ ఉంటుంది.

మరి హిందీలో అదేమైనా మార్పు చేసారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తెలుగులో డబ్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. రీమేక్ హక్కులు తన దగ్గర ఉంచుకున్న రాక్ లైన్ వెంకటేష్ ఒప్పుకుంటే తమిళ్ లో కూడా ఇది చూసే అవకాశం కలగవచ్చు. సో అతిలోకసుందరి వారసురాలిని చూడాలంటె ఓ లుక్ వేసేయండి మరి.

Comments

comments