Sports

బాబు కోహ్లి ఇదేనా నీ భవిష్యత్తు నిర్మాణం ?

భారత క్రికెట్ లో, జట్టుగా భారత్ ఎదగడంలో గంగూలీ తనదైన ముద్ర వేసిన సంగతి ఎవరూ కాదనలేని విషయం. గంగూలీ సారధి కాక ముందు టీం ఇండియా వేరు గంగూలీ సారధి అయిన తర్వాత టీం ఇండియా వేరు. గంగూలీ సారధ్యం చేపట్టిన తరువాత యువకులు, సీనియర్లతో జట్టు సమతూకంగా ఉండేది. ఏ ఆటగాడు కూడా జట్టులో తనకు చోటు దక్కలేదని బాధపడిన సందర్భాలు కూడా చాలా అరుదుగా ఉండేవి. ముఖ్యంగా విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు యువకులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవాడు గంగూలీ. దీనితోనే ద్రావిడ్, లక్ష్మణ్ లాంటి ఆటగాళ్ళు విదేశీ పిచ్ లపై ప్రత్యర్ధులకు సింహ స్వప్నంలా మారిపోయారు. తాను నమ్మితే యువ ఆటగాళ్ళు విఫలమైనా మరిన్ని చాన్సులు ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసం నింపేవాడు. ఇర్ఫాన్ పఠాన్, మొహమ్మద్ కైఫ్, యువరాజ్, హర్భజన్ లాంటి ఆటగాళ్ళు ఎందరో అతని సారధ్యంలోనే అగ్రస్థాయి ఆటగాళ్లుగా వెలుగొందారు. పార్ధివ్ పటేల్ లాంటి ఆటగాడు కీపర్ గా అతి చిన్న వయసులో టీం లోకి వచ్చాడు.

అయితే ఇప్పుడు ఆ విధానం కొనసాగుతుందా..? అంటే లేదనే సమాధానం వినపడుతుంది. దీనికి కోహ్లి వైఖరి కారణం అనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. ముఖ్యంగా రిషబ్ పంత్ లాంటి ఆటగాడిని కోహ్లి వినియోగించుకోవడం లేదనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. గత మూడేళ్ళ నుంచి పంత్ ఐపియల్ సహా దేశవాళి మ్యాచుల్లో నిలకడగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆటగాడికి మంచి భవిష్యత్తు ఉందని ప్రముఖ క్రీడాకారులు ప్రశంసించిన విషయం తెలిసేందే. కానీ జట్టులో చోటుకోసం ఆటను దాదాపు 3 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న విషయం విదితమే. బంతిని నేర్పుగా కొట్టటంతో పాటు, మంచి టెక్నిక్ అతని సొంతం. అవసరం అయినప్పుడు బ్యాట్ కి పని చెప్పగలడు, లేదంటే నిదానంగా మంచి టెక్నిక్ తో ఆడటం అతని ప్రత్యేకత.

 

ఈ ఏడాది ఐపియల్ లో అతని ఆట చూసిన విదేశీ ఆటగాళ్ళు ఒకరకంగా భయపడ్డారు కూడా, ఢిల్లీ ఓడినా పంత్ గెలిచాడు. అలాంటి ఆటగాడిని ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేస్తే మంచి ఫలితాలు రావడమే కాకుండా ఇంగ్లాండ్ లాంటి పిచ్ లపై అతనిని ఆడిస్తే రేపు ఆసిస్ లాంటి జట్లపై ఆడిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దీనితో అతను జట్టుకి బలంగా మారతాడనే అభిప్రాయ౦ వినపడుతుంది. అలాగే ఇప్పుడు ధోని కెరీర్ చరమాంకంలో ఉంది. పంత్ మంచి కీపర్, దానికి తోడు ఎడమ చేతి వాటం ఆటగాడు. అలాంటి ఆటగాడిని తీసుకోకుండా కోహ్లి తప్పు చేస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు. తానూ కూడా యువకుడిగా ఉన్నప్పుడు అవకాశాలు ఇవ్వతంతోనే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని మర్చిపోతే, అది తనని తానూ మోసం చేసుకున్నట్లే.

Comments

comments