movies

మహానటిలో ఘోర తప్పిదం…క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్

మహానటి సినిమాకి అందుతున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. చూసిన ప్రతి ఒక్కరూ సినిమాలోని ప్రతి ఫ్రేమును ఆస్వాదిస్తున్నారంటే.. ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సావిత్రి జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఒక్క సావిత్రి పాత్రనే కాదు కేవీరెడ్డి, చక్రపాణి, ఎల్వీ ప్రసాద్, ఏఎన్నార్, ఎస్వీఆర్ లాంటి మహామహుల పాత్రలను అచ్చుగుద్దినట్టు దింపేశాడు.
విమర్శలకు తావివ్వకుండా సినిమా తీశాడని అంటున్నారు. అంతాబాగున్నా.. చంద్రుడిపై మచ్చలాగ ఈ సినిమాలో ఓ చిన్న తప్పుదొర్లింది. గుమ్మడికి బదులు ఎస్వీఆర్‌ను చూపించారు. ఈ విషయాన్ని దర్శకుడు నాగీనే స్వయంగా చెప్పారు. ఓ వెబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు.
 ఈ సినిమాలో ఓ సీన్‌లో “గోరింటాకు” సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పటికి సావిత్రి అన్నీ కోల్పోయి చిన్న చిన్న పాత్రలతో నెట్టుకొస్తున్న టైమ్. షూటింగ్ అయిపోయాక సావిత్రి వెళుతుండగా… ఎస్వీఆర్ పలకరించి.. భోజనం పెట్టిస్తారు. అయితే రియల్ లైఫ్‌లో అలా పలకరించింది గుమ్మడి వెంకటేశ్వరరావు. వాస్తవానికి గోరింటాకు సినిమా సమయానికి ఎస్వీఆర్ చనిపోయారు.
ఆ సినిమాలో నటించింది గుమ్మడి. దీనిపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇస్తూ చెప్పింది ఏంటంటే.. సినిమా మొత్తం ఎస్వీఆర్ పాత్రను ఎస్టాబ్లిష్ చేశామని.. మళ్లీ గుమ్మడి పాత్రను ప్రత్యేకంగా చూపించలేకే అలా చేశామని చెప్పుకొచ్చారు. అకస్మాత్తుగా గుమ్మడి పాత్రను తీసుకొస్తే ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉండటంతో ఎస్వీఆర్ పాత్రతోనే అది చేయించామని చెప్పారు.
ఈ సినిమాలో ఎస్వీఆర్ పాత్రను డైలాగ్ కింగ్ మోహన్‌బాబు పోషించారు. పాత్రకు తగ్గ న్యాయం చేశారని.. ఆయన తప్ప మరొకరు ఆ పాత్రను చేయలేరని విమర్శకుల ప్రశంసలు పొందుతున్నారు.

Comments

comments