news

మెట్రోరైలుతో పాటు మెగామాల్స్ రెడీ !

హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధం కావడం సంతోషంగా ఉన్నదని మెట్రోమ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఈ శ్రీధరన్ పేర్కొన్నారు.ప్రయాణికులకు అతి త్వరలో చేరువ కావడానికి సిద్ధం అవుతున్న మెట్రోరైలు ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మిస్తున్న మెగామాల్స్ సిద్ధమయ్యాయి. మెట్రోరైలు మూడు కారిడార్లకు అనుసంధానంగా నిర్మిస్తున్న నాలుగు మెగా మాల్స్‌లో ఇప్పటికే రెండు మాల్స్ సిద్ధమవగా, మరో రెండు మాల్స్‌ను వచ్చే సంవత్సరం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నారు మెట్రో.

 

మల్టీఫ్లెక్స్‌లు..షాపింగ్ ఏరియాలు

ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు నిర్మిస్తున్న మెట్రోమాల్స్‌లో మల్టీఫ్లెక్స్‌లు, షాపింగ్ ఏరియాలు నిర్మిస్తున్నారు. మెట్రో ప్రయాణికులకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు షాపింగ్, ఫుడ్ కోర్టులు, దుస్తులు, జ్యూయలరీ దుకాణాలతోపాటు అన్ని సౌకర్యాలు ఉండేలా వీటిని పెద్ద ఎత్తున తీర్చిదిద్దుతున్నారు. ఒక్క సారి ఈ మాల్స్‌లోకి వెళ్తే ప్రతి వస్తువు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఉరుకులు పరుగులతో కూడిన నగర జీవితంలో సమయం వృథా కాకుండా మెట్రోమాల్స్ ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయి

లీజు, అద్దెలు ఖరారు

మాల్స్ విషయంలో ఎల్‌అండ్‌టీ, హైదరాబాద్ మెట్రోరైలు లీజు రెంటల్స్‌ను ఖరారు చేశాయి. వీటి రేంజ్‌ను చదరపు గజానికి రూ.50, రూ..130, రూ 150గా నిర్ణయించారు. విస్తీర్ణం అనుసరించి అద్దెను నిర్ణయించారు. పెద్ద స్టోర్స్ ఐతే ఒక చదరపు గజానికి రూ. 50 గా నిర్ణయించగా, చిన్న స్టోర్స్‌కు రూ.130 నుంచి 150 వరకు లీజుగా ఖరారు చేశారు. ఐతే మాల్స్‌లో నెలకు చదరపు గజానికి రూ.70 నుంచి 75గా నిర్ణయించినట్లు మెట్రోరైలు ప్రాజెక్టుకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.

మొదటిదశలో నడపనున్న 30 కిలోమీటర్ల నాగోల్-మియాపూర్ మార్గాన్ని ప్రారంభించిన రోజే పూర్తయిన రెండు మాల్స్‌ను ప్రారంభిస్తారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు గల కారిడార్-1కు అనుసంధానంగా పంజాగుట్ట, ఎర్రమంజిల్, ముసారాంబాగ్ ప్రాంతంలో మాల్స్ నిర్మిస్తుండగా, కారిడార్-3లో హైటెక్‌సిటీ ప్రాంతంలో నిర్మిస్తున్నారు. ఇందులో పంజాగుట్ట, హైటక్ సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న మాల్స్ నిర్మాణం పూర్తై రెంటల్స్‌కు సిద్ధమయ్యాయి.

Comments

comments