politics

హామీల చిట్టా ఇస్తే… మాకు తెలుసులే ఇచ్చిన పని చూసుకో అన్నారు !

తాను కోరుకున్న పదవి రాలేదన్న నిరాశలో, వైకాపాలో చేరటానికి అన్నీ సిద్ధం చేసుకున్న మాజీ మంత్రి, మాజీ కాంగ్రెస్ నాయకుడు, తాజా ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఎట్టకేలకు కమలదళాధిపతి అయ్యారు. అప్పటి వరకు నోరు తెరవని ఆయన, పదవి రాగానే బిజెపి నాయకులే ఆశ్చర్యపోయే విధంగా నోరు జారటం మొదలెట్టారు. ఎంతలా అంటే, అమిత్ షా తిరుమల వచ్చినప్పుడు ఆయన్ని హతమార్చే ఉద్దేశంతోనే ప్రజలు అలిపిరి దగ్గర దాడి చేశారు” అనేంతగా. ఆంధ్రప్రదేశ్ కి బిజెపి అన్యాయం చెయ్యలేదు అంటూ… చంద్రబాబుని విమర్శిస్తూ ఆయన ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితాన్ని వాడుతూ అధిష్టానం మెప్పుకోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.

ఎంతైనా జాతీయ పార్టీకి ప్రాంతీయ అధ్యక్షుడు కదా, ప్రధానిని కలిసే అవకాశం వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడిని కలవడానికి ఆయన ఢిల్లీ వెళ్లి బుధవారం కలిసి వచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రధానిని కలిసి వచ్చి ఉంటే అసలు ఏమి ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పటి వరకు ఏవైతే బిజెపి వారు రాష్ట్రానికి ఇచ్చేశారు అని ప్రకటిస్తున్నారో, వాటన్నిటిని మంజూరు చేయమంటూ ప్రధానికి ఒక లేఖ ఇచ్చి, మీడియాకి కూడా విడుదల చేశారు. నిధులు, ప్రాజెక్టులు మంజూరయ్యేలా చూడాలని కన్నా మోదీని కోరారు. తాము చెప్పడం వల్లే మోదీ ఇవి ఇచ్చారని చెప్పుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో కన్నా ఈ ఆలోచన చేశారట. ఆయన ఇచ్చిన లేఖ మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైంది. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అయింది.

 

ఇందుకు తగ్గట్టుగానే మోదీకి బాగా అర్థమయ్యేలా హిందీలో ఓ వినతి పత్రాన్ని రూపొందించుకుని వెళ్లారట. అది పూర్తిగా చదివిన ప్రధాని కుర్చీలో కూర్చునే కింద నుంచి పైకి కన్నాని ఒక లుక్ వేసారట. నాకు తెలియంది ఏదో నువ్వు చెప్పడానికి వచ్చావా అనే విధంగా.. పాపం ఆ ఉత్తరంలో కన్నా రైల్వే జోన్, పోలవరం నిధులు, విభజన హామీలు, అమరావతి నిధులు, ఇలా యేవో రాసుకుని వెళ్ళగా దానిని చూసి.. మాజీ మంత్రి గారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారట.

 

మీరు అడిగినవన్నీ టీడీపీ నేతలు కూడా అడిగారు. ఇవన్నీ ఇస్తే టీడీపీ, బీజేపీ నుంచి దూరమయ్యేది కాదు. ఇవన్నీ ఇచ్చే ఆలోచన ఉంటే టీడీపీ ఎందుకు దూరం చేసుకుంటాం. అయినా ఇవన్నీ ఇస్తే పార్టీని బలోపేతం చేయడానికి మీరెందుకు. ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన వాటినే ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీని బలోపేతం చేయడం ఎలా అనే దానిపై మీరు దృష్టి పెట్టండి అని చెప్పి శాలువ కప్పించుకుని ఏవో నాలుగు మంచి మాటలు చెప్పి గేటు అటు అన్నట్టు సైగ చేశారట. బయటకి వచ్చాక ఇక మాములుగా మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించినట్లు చెబుతున్నా, లోపల జరిగింది ఇదేనని ఢిల్లీ నుంచి వార్తలు వచ్చాయి.

Comments

comments