politics

రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?

కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఇమడలేక పోతున్నారా? కాంగ్రెస్ పార్టీ తనను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని ఫీలవుతున్న రేవంత్ రెడ్డి ఆ పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టబోతున్నారా?.. అవుననే అంటున్నారు రేవంత్ సన్నిహితులు.
 తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఫైర్‌బ్రాండ్ నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణలో బలమైన రాజకీయ నేతగా ఉన్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే క్రాంగ్రెస్సే సరైన పార్టీ అని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే కాబట్టి ఆపార్టీతోనే కేసీఆర్‌ను ఢీకొనాలని భావించిన రేవంత్..
ఇప్పుడు ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. తెలుగుదేశంలో ఉన్నంత ఫ్రీడం కూడా కాంగ్రెస్ తనకు లేకుండా పోయిందని, చంద్రబాబు వద్ద తాను ఎంత చెబితే అంతేనని, కాంగ్రెస్‌లో కనీసం తనను గుర్తించడం లేదని సన్నిహితుల వద్ద రేవంత్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అధిష్టానం తనను గుర్తించి, తన శక్తిసామర్థ్యాలను పార్టీ కోసం ఉపయోగించుకుంటుందని ఇన్ని రోజులు రేవంత్‌రెడ్డి ఓపికగా ఉన్నారని, రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా అధిష్టానం తనకు ఎలాంటి బాధ్యతలను అప్పగించకపోవడంతో రేవంత్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని రేవంత్ అన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
 తనకు సరైన గుర్తింపు లేని పార్టీలో ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే అన్న భావనలో రేవంత్ ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. ‘‘రాష్ట్ర కాంగ్రెస్ టీం లీడర్‌కు సలహాలు ఇచ్చే వారు సరిగ్గా లేరు. నా పని తీరు తెలిసి కూడా టీం లీడర్ నన్ను సరిగా వాడుకోవడం లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా వద్దని రాహుల్‌కు లేఖ రాస్తా. నా హోదాకు తగ్గ పదవే కావాలి. మంత్రి పదవి ఇచ్చినా తీసుకోను.
నా లక్ష్యం సీఎం కావడమే’’ అని రేవంత్‌రెడ్డి బహిరంగ ప్రకటన చేయడం కాంగ్రెస్‌లో కలవరం పుట్టించింది. దీంతో సీనియర్ నేతలంతా రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారు తామే సీఎం అభ్యర్థి అని ప్రకటించుకుంటుండడంతో కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీని పిలిచి చర్చించినట్లు తెలుస్తోంది. ఎందరో సీనియర్ నేతలున్న పార్టీలో రేవంత్‌కు సీఎం అభ్యర్థిగా అవకాశం రావడం కష్టమేనని కాంగ్రెస్‌లో చాలామంది భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త పార్టీ పెట్టడమే మేలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే తానే కొత్త పార్టీ పెట్టి ఎన్నికల ప్రచారం చేయాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు సమచారం. చూద్దాం.. ఎన్నికలకు ఏడాది కూడా లేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

Comments

comments