news

రాశులు కలిసిన జంటల మధ్య విడతీయలేని ప్రేమ!

కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళి చేసినా, అబ్బాయి, అమ్మాయి రాశులు కలవకపోతే ఆ బంధం కలకాలం నిలవదనేది చాలా మంది విశ్వాసం. ఇది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన విశ్వాసం కాదు. దశాబ్దాల తరబడి నరనరాల్లో జీర్ణించుకున్న నమ్మకం. 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టినా సరే ఈ నమ్మకం చెక్కు చెదరలేదు.

అమ్మాయికీ, అబ్బాయికీ పెళ్ళి చేయాలంటే ఒకరికొకరు నచ్చడం, మనసులు కలవడం ప్రధానం కాదు, వారి రాశులు కలవడం ముఖ్యం అనుకుంటున్నారు. అప్పుడే వాళ్ళు కలకాలం కలిసి ఉంటారన్నది కూడా చాలామంది నమ్మకం. ఏఏ రాశుల వారు పెళ్ళి చేసుకుంటే ఎంత ఆనందంగా సుఖంగా ఉంటారో అన్న విషయాలు మీ కోసం….

మేషం – కుంభం

ఈ రాశులు వారు డల్‌గా ఉండడం కానీ, మూడీగా ఉండడం కానీ జరగదు. వీరిలో ఎల్లప్పుడూ నూతనోత్సాహం వెల్లివిరుస్తూ ఉంటుంది. ఈ రెండు రాశులవారు వివాహం చేసుకుంటే ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఇద్దరు ఒకే రకంగా ఆలోచించడంతో పాటు ఇద్దరి అభిరుచులు ఒకేలాగా ఉంటాయి. ఇల్లు, కుటుంబం, స్థిరత్వం వంటి విషయాలలో ఏకాభిప్రాయం కలిగి ఉంటారు. స్నేహితులతో కలిసి ఆనందంగా గడపడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఒకరికొకరు బాధ పెట్టుకోవడం కానీ, కించపరుచు కోవడం వంటివి చేయరు. ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగిపోతారు కనుక వీరిద్దరినీ సరి జోడి అంటారు.

వృషభం – కర్కాటకం

ఈ రాశులకు చెందిన జంట ఒకరికోసం ఒకరు అన్నట్టుగా జీవిస్తారు. మానసికంగా, శారీరకంగా వీరిమధ్య బంధం పటిష్టంగా ఉంటుంది. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ తమ బంధాన్ని మరింత పదిలపరుచుకుంటారు. ఇద్దరూ ఎలాంటి గొడవలు లేకుండా ముందుకు సాగుతారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటారు. ఒకరికొకరు పొగుడుకోకపోయినా, పొరపొచ్చాలుఅన్నవి లేకుండా జీవితాంతం ఒకరి పట్ల మరొకరు ప్రేమగా, అభిమానంగా ఉంటారు. ఈ రెండు రాశులవారు వివాహం చేసుకుంటే వారి జీవితం సుఖంగా, ఆనందంగా సాగుతుందని అంటారు.

మిథునం – కుంభం

ఈ రాశులవారు ఒకరిపట్ల ఒకరు విపరీతమైన ప్రేమ, అభిమానం కలిగి ఉంటారు. కొద్దికాలం కిందట కలిసినా, ఎన్నో సంవత్సరాల తరబడి పరిచయం ఉన్నవారిలా కలిసిపోతారు. వీరిద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉండడమే కాకుండా కొత్తదనాన్ని ఎక్కువ ఇష్టపడతారు. ఇద్దరూ కలిసి ఉండేందుకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. కుంభరాశి వారు క్రియేటివ్‌గా ఉంటే మిథునరాశి వారు దాన్ని ఆస్వాదిస్తారు. ఒకరికొకరు అన్నట్టుగా కలిసిపోతారు. ఈ జంట కలకాలం సుఖంగా, సంతోషంగా ఉంటుందని చెబుతారు.

కర్కాటకం – మీనం

ఈ రెండు రాశులు నీటికి సంకేతాలు. ఇద్దరూ చాలా సున్నిత మనస్కులు. ఒకరికొకరు బాధ పెట్టుకోవడం కానీ, పరుషంగా మాట్లాడుకోవడం కానీ చాలా వరకూ చేయరు. ఒకరి అభిప్రాయలు మరొకరి అభిప్రాయాలతో చాలా వరకూ కలుస్తాయి. మీనరాశి వారు ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతారు. చేసే పని పట్ల చివరి వరకూ నిబద్ధత కలిగి ఉంటారు. బంధం విషయంలో కూడా అలాంటి నిబద్ధతే కలిగి ఉండడం వలన వీరి బంధం కలకాలం నిలిచి ఉంటుంది. ఈ రెండు రాశుల వారిని బెస్ట్‌ కపుల్స్‌ అంటారు.

సింహం – ధనుస్సు

సింహరాశి వారిలో ఉండే ఆత్మవిశ్వాసాన్ని ధనుస్సు రాశి వారు బాగా ఇష్టపడతారు. సింహరాశి వారు సమస్యలను తెలివిగా, లౌక్యంగా పరిష్కరించుకోగలుగుతారు. ఇద్దరూ ఒకరంటే ఒకరు అభిమానంగా ప్రేమగా ఉంటారు. జీవితాన్ని ఆస్వాదిస్తారు. లక్ష్యాలను చేరుకోవడంలో ఒకరికొకరు సహాయంగా ఉంటారు. ఒకరికొకరు అన్నట్టుగా జీవితాన్ని గడుపుతారు. వీరిద్దరూ సరిజోడి అనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు అంటారు.

కన్య – వృషభం

ఈ రాశుల వారిది హిట్‌ పెయిర్‌గా చెప్పవచ్చు. రెండు రాశుల వారు ప్రశాంతంగా, ఒకరిపట్ల మరొకరు నీతిగా నిజాయితీగా ఉంటారు. అన్ని విషయాలనూ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. తమ బంధం కలకాలం కొనసాగించేందుకు ఇష్టపడతారు. ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. నేలవిడిచి సాము చేయకుండా జీవితాన్ని సుఖమయం చేసుకునేందుకుకే ఎక్కువ ఇష్టపడతారు. కన్యారాశి వారిలో ఆలోచనా శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రాశుల వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు.

తుల – కుంభం

ఈ రాశుల వారిద్దరి మధ్య శారీరకంగా, మానసికంగా బంధం చాలా గట్టిగా ఉంటుంది. కొత్తకొత్త విషయాలను తెలుసుకోవడంలో ఇద్దరూ ఉత్సాహంగా ఉంటారు. ఇద్దరి మధ్య మంచి అవగాహన కలిగి ఉంటారు. అపార్థాలకూ అపోహాలకు తావు చాలా తక్కువ. ఒకరకంటే ఒకరికి ప్రేమ, గౌరవం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రాశుల వారిది అద్భుతమైన జంట అని చెబుతారు.

వృశ్చికం – కర్కాటకం

ఈ రాశి వారు ఒకరిపట్ల ఒకరు అభిమానంగా ఇష్టంగా ఉంటారు. ఈ రాశుల వారు విడివిడిగా ఎలా ఉన్నా జోడిగా మారితే బాగుంటారు. ఒకరి పట్ల మరొకరు కేరింగ్‌గా ఉంటారు. కాకపోతే వృశ్చికరాశివారిలో అసూయ కొద్దిగా ఉంటుంది. కానీ భాగస్వామి పట్ల పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఒకరి పట్ల ఒకరు కేరింగ్‌గా వ్యవహరిస్తారు.

మకరం – వృషభం

మకర రాశి వారు వృషభ రాశివారిలో ఉండే జాలి దయాగుణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. వృషభరాశి వారిలో పనిపై ఉండే ఆసక్తిని, సెన్సాఫ్‌ హ్యూమర్‌ని మకరరాశి వారు ఇష్టపడతారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఒకరి సామీప్యాన్ని ఒకరు చివరి వరకూ బాగా ఎంజాయ్‌ చేస్తారు. వీరిద్దరి జోడి అన్నివిధాలా బాగుంటుంది. ఇద్దరూ మంచి జోడి అని అందరి చేతా ప్రశంసలు అందుకుంటారు.

ధనుస్సు – మేషం

ఈ రెండు రాశుల వారు సోషలైజింగ్‌ని ఎక్కువగా ఇష్టపడతారు. ఒకరినొకరు ఇష్టపడుతూ, సహకరించుకుంటూ ముందుకు సాగుతారు. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు. ఈ రెండు రాశుల వారిది పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌ అంటారు.

కుంభం – మిథునం

కుంభరాశి వారు క్రియేటివ్‌గా ఉంటారు. మిథునరాశి వారు దీన్ని బాగా ఇష్టపడతారు. ఈ రెండు రాశుల వారి జంట ఎలాంటి ఒడిదుడుకులైనా ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు.

మీనం – వృశ్చికం

ఈ రెండు రాశులవారు ఒకరికొకరు అర్థం చేసుకునే గుణం కలిగి ఉంటారు. మీనరాశి వారు ఎలా ఆలోచిస్తారో వృశ్చికరాశి వారు కూడా అలాగే ఆలోచిస్తారు. అలాగని వీరు ఏమీ పెద్ద తెలివితేటలు కలవారని చెప్పడానికి వీల్లేదు. రెండు రాశుల వారిలోనూ సర్దుకుపోయే తత్త్వం ఉంటుంది. ఈ రెండు రాశుల వారు వివాహం చేసుకుంటే జీవితం ఆనందమయం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారు.

మేషం – కర్కాటకం

మేషరాశి వారు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. ఏ విషయంలోనైనా డేరింగ్‌గా ముందుకు వెళ్ళే స్వభావం వీరిది. కర్కాటక రాశి వారు తమ ప్రవర్తనతో ఇతరుల నుంచి తరచూ ప్రశంసలు పొందుతూ ఉంటారు. ఈ రెండు రాశుల వారు వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది.

మేషం – మీనం
మీనరాశి వారు చాలావరకూ సాత్విక స్వభావం కలిగి ఉంటారు. ఎదురు తిరగడం అన్నది సాధారణంగా జరగదు. మేషరాశి వారి సంతోషం కోసం మీనరాశి వారు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఒకరి సంతోషం కోసం ఒకరు ఆరాటపడతారు. వీరిది మంచి జంట అని చెప్పవచ్చు.
ఈ లక్షణాలు తప్పనిసరి

కాలంతో పాటు అమ్మాయిలు, అబ్బాయిల మనస్తత్వాలు, ఆలోచనలు, అభిరుచులు మారిపోతున్నాయి. అమ్మాయిలు తమకు సరైన భాగస్వామిని ఎంచుకోవడంలో కొద్దిగా తడబడుతూనే ఉంటారు. అందుకే అమ్మాయిలూ! కాబోయే భాగస్వామి మీకు సరైన జోడి అని తెలుసుకోవాలంటే, ఈ కింది లక్షణాలు వారిలో ఉన్నాయో లేదో తెలుసుకోండి. 

  • జీవిత భాగస్వామిలో అమ్మాయిలు చూడవలసిన మొట్టమొదటి లక్షణం ధైర్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టిన చేయి విడువకుండా సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోగలగాలి.
  • మంచి అలవాట్లు అన్నిటి కన్నా చాలా ముఖ్యం. ఉదయాన్నే నిద్రలేవడం వంటివి ఉన్నాయో లేదో సరిచూసుకోండి
  • మీ ప్రైవసీని గౌరవించే వ్యక్తినే భాగస్వామిగా ఎంచుకోండి. ఈ లక్షణం అతనిలో ఉందో లేదో పరిశీలించండి.
  • ప్రాధాన్యతలు చాలా ముఖ్యం. స్వీట్‌ మెమరీ్‌సని మరిచిపోకూడదు. కొందరు అనవసర విషయాలు గుర్తు పెట్టుకుంటారుకానీ, స్వీట్‌ మెమరీ్‌సకి అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. అతని ప్రాధాన్యతలు ఏమిటో గమనించండి.
  • తమ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకునేవారు జీవితభాగస్వామి విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఈ కారణంగా ధూమపానం, మద్యంలాంటి అలవాట్లకు దూరంగా ఉంటారు.
  • మీరు ఇష్టపడే లేదా వివాహం చేసుకోబోయే వ్యక్తిలో ఎదుటి వారిని గౌరవించే లక్షణం ఉందో లేదో గమనించండి. ఎదుటి వారిని గౌరవించలేని వ్యక్తి జీవితభాగస్వామిని కూడా గౌరవించలేడని అంటారు.
  • శ్రద్ధ అనేది అత్యవసరం. చేసే పనిలో శ్రద్ధవహిస్తే ఉన్నత శిఖరాలు అందుకోవచ్చు. ఇది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. ఏదైనా సరే మీరు ఇష్టపడే అబ్బాయిలో ఈ లక్షణం ఉందేమో గమనించండి.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment