health

మండు వేసవిలో ఈ 8 టిప్స్ మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

వేసవి అడుగు పెట్టింది. సూర్యకాంతి అశేషంగా మనపై ప్రసరిస్తూ ఉంది. ఇప్పటికే 40డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో, స్ట్రా వేసుకుని మరీ మనలో నీటిని స్వాహా చేస్తున్నాడు సూర్యుడు. సూర్యుడు నిజానికి శక్తికి ప్రాధమిక వనరుగా ఉన్నప్పటికీ, దాని దహించే కిరణాలు మాత్రం స్వాగతించేవి కావు. వేసవిలో ప్రతిచోటా పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా సకల జీవచరాలు ఈ ఎండ వేడిమి నుండి తప్పించుకోవడానికి ఆశ్రయం కోసం చూస్తున్న తరుణంలో, ఉపశమనం కోసం చల్లని వాతావరణాలకు మారాల్సిన అవసరం ఉంది. ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రదేశాలకు అందరూ వెళ్ళలేరు కదా. తద్వారా ఇళ్ళలో ఎయిర్ కండిషనర్లకు అతుక్కుపోవలసిన స్థితులు నెలకొన్నాయి.

ఒకవేళ వేరే ప్రదేశాలలో ఉన్నాకూడా, ఎక్కువ కాలం అక్కడ ఉండలేము.ఏమంటారు? మరియు తరచుగా ఉండే కరెంట్ కోతలు, బిల్లులు ఎయిర్ కండిషనర్ కలలను తునాతునకలు చేస్తుంది. తద్వారా సూర్యునితో పోటీ పడలేక ఓటమిని అంగీకరించక తప్పదు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం ద్వారా ఎండ నుండి కాస్తైనా ఉపశమనం పొందవచ్చని తెలియనిది కాదు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం ద్వారా, అనేక క్లిష్టపరిస్థితుల నుండి బయటపడవచ్చు కూడా. ఒకరకంగా శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడం అనేది సూర్యునితో పోరాడే శక్తివంతమైన ఆయుధంగా ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. వేడి వాతావరణం అంతర్గతంగా మరియు బాహ్యంగా మన శరీరానికి చాలా సమస్యలను సృష్టిస్తుంది. బయట పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన శరీర ఉష్ణోగ్రతను కూడా అలాగే పెంచుతాయి. దీన్ని నిర్వహించడానికి, మన శరీరం టన్నులుటన్నులుగా చెమటను ఉత్పత్తి చేస్తుంది.

అదనపు చెమట శరీరం యొక్క ఉపరితలంపై చేరి మన శరీరం ఎర్రబారడానికి, దద్దుర్లకు మరియు దురదకు కారణాలుగా మారడమే కాకుండా శరీరంలోని ద్రవాల నష్టానికి కారణమవుతుంది. మన శరీరంలో కోల్పోయిన ద్రవపదార్ధాలను భర్తీ చేయకపోతే అది నిర్జలీకరణానికి(డీహైడ్రేట్) గురిచేస్తుంది. ఇక్కడ మన శరీరo 70% నీటితో తయారు చేయబడినది. శరీరం నీటిని కోల్పోయినప్పుడు, తగినంత ద్రవాలు తాగడం చేయకపోతే ఆ నీటిని భర్తీ చేయలేని కారణాన, నిర్జలీకరణకు దారితీస్తుంది. నిర్జలీకరణ పరిస్థితులు దీర్ఘకాలంలో ఉన్న ఎడల వడదెబ్బ వంటి ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.

కావున శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. శరీరానికి తగిన నీళ్ళను అందివ్వని పక్షంలో దురదృష్టవశాత్తూ ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు. ఈ ఉష్ణోగ్రతలను నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాని పనే, కానీ తట్టుకోగలగడానికి మాత్రం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచక తప్పదు. హైడ్రేషన్ అంటే కేవలం నీటిని తాగడమే కాదు. మీ శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం. ఇక్కడ మీరు ఈ వేసవి సీజన్లో మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే మార్గాలు పొందుపరచబడినవి.

1. శరీరాన్ని జ్యూస్ తో నింపండి: మీరు సాదానీటిని తీసుకొనడానికి బోర్ ఫీల్ అయితే, ఐస్ ముక్కలు వేసిన వివిధరకాల పండ్ల రసాలను కానీ, ముక్కలను కాని తీసుకోవడం ద్వారా, అవి అందించే వివిధ విటమిన్లు మరియు ఖనిజాలతో పాటు శరీరానికి అవసరమైన హైడ్రేషన్ పొందగలరు.

2. రోజుకు కనీసం ఒక్క కొబ్బరికాయ : కొబ్బరినీరు మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సూచించబడిన ఉత్తమమైన, సహజమైన మరియు చౌకైన మార్గం. ప్రయాణాలలో ఒక నీళ్ళ బాటిల్ తీసుకువెళ్ళడానికి గందరగోళానికి మనసు గురవుతూ ఉంటే, తాజా కొబ్బరినీరు మీకు ఉత్తమ మార్గంగా సూచించబడుతుంది. గ్రామాల్లో, పట్టణాలలో, నగరాల్లో ఏ వీధి మూలల్లో అయినా దొరికే అద్భుతమైన పానీయం ఈ కొబ్బరినీరు. కొబ్బరినీరు, ఎలక్ట్రోలైట్లను మెగ్నీషియంను అధికంగా కలిగి ఉంటుంది, ఇది వెంటనే మీ శరీరం మరియు మనస్సును రిఫ్రెష్ చేసి, మీ శరీర ఉష్ణోగ్రతని నియంత్రిoచడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది.

3. పానీయాలేనా ఇంకేమీ లేవా ? కూరగాయలు, పండ్లు వంటివి కూడా నీటికి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. తాజా కూరగాయలను తరిగి, మీకు నచ్చిన పదార్ధాలను జోడించి సలాడ్లు వలె తయారు చేసి తీసుకోవడం మూలంగా కూడా శరీరానికి కావలసిన నీటిని అందివ్వగలము. కీరా దోసకాయలు, టమోటాలు మరియు ఆకుకూరలు వంటి శాకాహారాలు అధికంగా పోషకాలను కలిగి ఉండి శరీరానికి శక్తిని చేకూర్చడమే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయం చేస్తాయి.

4. తేలికైన ఆహారం: వేసవిలో, కడుపులో తేలికైన మరియు సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు తినడం మీ జీర్ణవ్యవస్థ యొక్క బరువును తీసి సులభంగా జీవ క్రియలు మెరుగుపడడంలో సహాయపడుతుంది. తద్వారా అసౌకర్యం లేకుండా చూడగలుగుతుంది. డీప్ ఫ్రై, మసాలా, ఆయిల్ పదార్ధాలు ఎక్కువ తీసుకున్న ఎడల శరీర ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా డీహైడ్రేట్ కు కూడా దారి తీస్తుంది. అనేకమందికి కాలంతో సంబంధం లేకుండా మాంసాహారాన్ని తరచుగా తీసుకునే అలవాట్లను కలిగి ఉంటారు. నిజానికి ఇలాంటివి అనారోగ్య లక్షణాలుగా చెప్పబడినవి. ఏదైనా మితంగానే తీసుకోవాలి. తేలికైన ఆహారం తీసుకోవడం మూలంగా రోజంతా తాజాగా మరియు చురుకుగా ఉండేలా శరీరాన్ని మలచుకోవచ్చు.

5. సూప్స్: మీ ఆహారంలో నీటిని చేర్చడానికి సూప్స్ మరొక గొప్ప మార్గం. వేసవిలో తేలికైన మరియు ఆరోగ్యకరమైన సూప్స్ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో ఉత్తమమైన మార్గాలుగా సూచించబడినవి. వంటింటిలో సహజంగా లభించే సుగంధ ద్రవ్యాలతో పాటు వాటిలో ఉన్న సమ్మేళనాలు శరీరాన్ని ఆహ్లాదంగా ఉంచుటలో దోహదం చేస్తాయి. గరిష్ట ప్రయోజనాల కోసం ఇంటిలో సూప్స్ ను తయారు చేయడం మరియు తాజా ఆకుకూరలతో అలంకరించుకోవడాన్ని అలవాటుగా చేసుకోండి. మీరు కొన్ని రకాల సూప్ పొడులను తయారు చేసుకుని నిల్వ ఉంచడం వలన, త్వరితగతిన సూప్స్ తయారు చేసుకునే వీలుంటుంది.

6. వేసవిలో మజ్జిగ సాయం: మజ్జిగ అధికారికంగా మన జాతీయ వేసవి పానీయం. ప్రముఖ పాడి ఉత్పత్తుల సంస్థల ద్వారా మీడియాలో వచ్చే విజయవంతమైన ప్రకటనల ప్రచారానికి ధన్యవాదాలు. ఆ స్థితికి మజ్జిగ ఖచ్చితంగా అర్హత పొందినదే. ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్స్ అందించడంతో పాటు మన శరీరంలో అద్భుతమైన శీతలీకరణ లక్షణాలను కలిగిoచేలా మజ్జిగ ఉంటుంది. ఇది మన శరీరానికి కేవలం పోషకాహారంగా మాత్రమే కాదు, మన జీర్ణ క్రియలను ఆరోగ్యoగా ఉంచడంలో జాగ్రత్త తీసుకుంటుంది. ప్రయాణాలలో కనీసం ఒక బాటిల్ మజ్జిగను వెంట ఉంచుకోవడం ద్వారా ఈ వేసవి కాలంలో ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

7. కెఫీన్ నుండి దూరంగా: కెఫిన్ లోడ్ చేయబడిన పానీయాలు వేసవిలో మీ శరీరానికి అత్యంత హానికరంగా ఉంటాయి. కెఫీన్ శరీరాన్ని డీహైడ్రేట్ చేయగలదు. మీరు రోజువారీ అలవాటులో భాగంగా కెఫీన్ తీసుకోవడం కూడా ఉంటే ఈ వేసవిలో ఎంత తగ్గిస్తే అంత మంచిది.

8. నీళ్ళు – ఇంతకు మించిన ఉత్తమ మార్గమే లేదు మీరు ఎన్ని రకాల పానీయాలు తీసుకున్నా, సలాడ్లను మీ ఆహార ప్రణాళికలో భాగంగా చేర్చినా కూడా సాదా నీళ్ళను కూడా తీసుకోవడం ఎంతో మంచిది. కనీసం గంటలో ఒక్కసారైనా ఒక్క గ్లాసు నీళ్ళను తీసుకోవడం ఈ వేసవికాలంలో ఎంతో ముఖ్యంగా చెప్పబడింది. ఒక్కోసారి మీరు తీసుకునే నీటి శాతానికి మీ మనసు సంతృప్తి చెందినా మీ శరీరం తృప్తి చెందకపోవచ్చు. కావున నీటిని అధికంగా తీసుకోవడానికి ప్రయత్నించండి.

Comments

comments