Business

మీ పిల్లలకి డబ్బు పొదుపు గురించి ఇలా చెప్పండి

ఇప్పటి పిల్లలు.. అంతర్జాలాన్ని అవలీలగా వాడగలరు.. ఎంతటి స్మార్ట్‌ ఫోన్‌ అయినా వారి చేతిలో చెప్పినట్లు వినాల్సిందే.. ఏ కొత్త విషయమైన ఇట్టే నేర్చుకుంటూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మరి ఈ ఆసక్తి డబ్బు విషయంలోనూ ఉందా? అనుమానమే కదూ! అన్ని విషయాల్లోనూ కనిపించే ఆసక్తిని చూసి మురిసిపోయే తల్లిదండ్రులు కూడా పిల్లలకు డబ్బు విషయాలు చెప్పడానికి మాత్రం వెనకడగు వేస్తారు. పిల్లల భవిష్యత్తుకు విద్య ఎంత ముఖ్యమో.. ఆర్థిక విజ్ఞానం కూడా అంతే అవసరం అని గమనించాలి. అప్పుడే వారు అన్నింటా విజయం సాధించగలరు.

పిల్లలు ఏదైనా సరే.. స్వతహాగా నేర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. డబ్బు విషయం కూడా అంతే. కేవలం మాటలతో చెబితే వారికి ఏమాత్రం అర్థం కాదు. డబ్బుతో ముడిపడిన చిన్న చిన్న పనులు వారితోనే చేయించాలి. రూ.10, రూ.20 నోట్లను, కొన్ని నాణేలను వారి చేతికి ఇచ్చి చిన్న చిన్న ఖర్చులకు చెల్లింపులు జరిపేలా చూడాలి. ఉదాహరణకు మీరు కిరాణా దుకాణానికి వెళ్తే.. అక్కడ అయిన ఖర్చును పిల్లలకు చెప్పి, అంత మొత్తమే ఇవ్వాలని చెప్పాలి. ఏదైనా వస్తువు కొనేముందు దాని ధరను ఎక్కడ ముద్రించి ఉంటుందో చూపించాలి. దానివల్ల వారికి డబ్బు ఎలా ఖర్చవుతుందో తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల వారికి డబ్బును ఖర్చు చేసే పద్ధతి తెలియడంతోపాటు, డబ్బు లెక్కలూ సులభంగా అర్థం అవుతాయి.

పొదుపు నేర్పుదాం!
డబ్బంటే ఖర్చులు ఒక్కటే కాదు కదా! పిల్లలకు పొదుపు చేయడమూ నేర్పాలి. ఖర్చు చేస్తున్నప్పుడు ఎంత డబ్బు మిగిల్చారో ఆ మొత్తాన్ని వారికి కేటాయించిన డిబ్బీలో వేసుకునేలా ప్రోత్సహించాలి. చిన్నతనం నుంచే అంటే ముచ్చటగా మూడేళ్ల వయసు నుంచి పొదుపు గురించి తెలిపే ప్రయత్నం జరగాలి. వయసు పెరుగుతున్న కొద్దీ చేతికి కొంత సొమ్ము ఇస్తూ… అందులో కొంత ఖర్చు పెట్టుకునేలా, కొంత మిగిల్చుకుని దాచుకునేలా అలవాటు చేయాలి.

బ్యాంకులు తోడుగా…
పిల్లల కోసం బ్యాంకులు ప్రత్యేకంగా ఖాతాలను అందిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులతోపాటు, ప్రైవేటు బ్యాంకులు కూడా ఈ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే, ఇందులో రెండు రకాల ఖాతాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులు పిల్లల వయసుతో నిమిత్తం లేకుండా ఖాతాలను అందిస్తున్నాయి. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు తదితర బ్యాంకుల్లో పదేళ్లలోపు పిల్లలకు కూడా ఖాతాలు ప్రారంభించే వెసులుబాటు ఉంది. 10 ఏళ్ల వయసు దాటి 18 ఏళ్లలోపు ఉన్నవారికి దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఖాతాలను ప్రారంభించే వెసులుబాటు ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కిడ్స్‌ అడ్వాంటేజీ అకౌంట్‌; ఐసీఐసీఐ బ్యాంకు యంగ్‌ స్టార్స్‌ అకౌంట్‌; కొటక్‌ మహీంద్రా మై జూనియర్‌ అకౌంట్‌; యాక్సిస్‌ బ్యాంకు ఫ్యూచర్‌ స్టార్‌ సేవింగ్స్‌ అకౌంట్‌; ఐడీబీఐ బ్యాంకు పవర్‌ కిడ్స్‌ పేర్లతో ఖాతాలను అందిస్తున్నాయి. పేర్లు వేరైనా ఈ ఖాతాల పనితీరు అంతా ఒకే రీతిన ఉంటుంది. డెబిట్‌ కార్డు, చెక్కుబుక్కులను కూడా ఇస్తారు. అయితే, తల్లిదండ్రుల అనుమతి, పర్యవేక్షణ తప్పనిసరి. కనీస నిల్వ బ్యాంకులను బట్టి రూ.1,500 నుంచి రూ.5వేల వరకూ ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకుల్లో రూ.250 నుంచి రూ.500 వరకూ కనీస నిల్వ ఉంటుంది.

ఓపెన్‌ సేవింగ్స్‌ ఖాతా: మీ పిల్లలు అమ్మాయి లేదా అబ్బాయి గాని టీనేజ్‌లో ఉంటే, వారిని బ్యాంకులో ఒక పొదుపు ఖాతాను తెరవమని చెప్పటం చాలా తెలివైన పని. వారిని డబ్బును బ్యాంకు ఖాతాలో జమచేయమని అడగండి. తర్వాత వారు దాచుకున్న డబ్బు పెరుగుదల చూసి వారు మిమ్మల్ని చాలా అభినందించండి.

రివార్డ్‌ సేవింగ్స్‌: పిల్లలు క్రమంగా పొదుపు చేయటానికి అలవాటుపడితే వారికి బహుమతులు ఇవ్వండి. డబ్బును ఆదా చేయటం పెద్ద క్లిష్టమైన పనేమీ కాదు. అయినప్పటికీ… సేవింగ్స్‌ అలవాటు వారివారి భవిష్యత్తుకు చాలా ముఖ్యం. రోజూ చిన్న మొత్తంలో ఆదా చేయటంలో పిల్లలకి సహాయపడితే, అది వారికి అలవాటుగా మారుతుంది. దానివలన వారి ముందరి జీవితం బాగుంటుంది.

* మీకు వీలున్న బ్యాంకులో ఖాతా పిల్లల పేరుమీద ఖాతా ప్రారంభించండి. కొన్ని బ్యాంకులు పిల్లల ఖాతాలు ప్రారంభించగానే అందమైన కిడ్డీ బ్యాంకును అందిస్తాయి. ఆంధ్రాబ్యాంకు ఇందుకు ఉదాహరణ. దీనికి రహస్య తాళం ఉంటుంది. బ్యాంకు శాఖలోనే దీన్ని తెరవాలి.

* ప్రతి నెలా నిర్ణీత తేదీ నాడు ఖాతా ఉన్న బ్యాంకుకు మీ పిల్లలను తీసుకెళ్లి అప్పటివరకూ వారు దాచుకున్న మొత్తాన్ని ఖాతాలో జమ చేసేలా చూడాలి. దీనివల్ల బ్యాంకు గురించి అవగాహన పిల్లలకు పెంచినవారమవుతాం. డబ్బు దాచుకునేందుకు పిల్లలను కూడా ఉత్సాహం వస్తుంది.

* పిల్లల ఖాతా కేవలం పొదుపుకే పరిమితం కాకుండా.. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా బీమా రక్షణ కల్పిస్తుంది. ప్రమాద, జీవిత బీమా ధీమానిస్తుంది. ఖాతాలు ప్రారంభించేందుకు ముందుగా ఈ విషయాన్ని చూసుకోండి.

ప్రోత్సాహాలు అందించండి…
పెరిగే పిల్లలకు స్వతహాగా సంపాదించాలి అనే ఆలోచన కల్పించాలి. దీనికోసం వారికి చిన్న చిన్న పనులు అప్పగించి, వాటిని పూర్తి చేసిన తర్వాత కొంత మొత్తం ఇవ్వండి. ఇది మరీ ఎక్కువగా ఉండకూడదు. పని చేస్తేనే డబ్బులు వస్తాయి అనే జ్ఞానం కల్పించడమే లక్ష్యంగా ఇది సాగాలి. చేసిన పని ప్రాధాన్యాన్ని బట్టి డబ్బు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం. మీ పిల్లలు ఈ పని చేస్తే ఇన్ని డబ్బులు ఇస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందే చెప్పకండి. కేవలం వారు ఆ పని చేసినందుకు మెచ్చుకోలుగా మాత్రమే మీరిచ్చే సొమ్ము ఉండాలి. పదేళ్లు దాటిన పిల్లలకు వారి అవసరాలకు ఎంత మొత్తం అవుతుందో లెక్క చూసుకోమని చెప్పాలి. ఆ మొత్తాన్ని అందించడం ద్వారా వారు వృథా ఖర్చులు చేయకుండా అడ్డుకట్ట వేయవచ్చు.

చర్చల్లో భాగస్వామ్యం..
పిల్లల ముందు డబ్బు విషయాలు మాట్లాడటం చాలామందికి నచ్చదు. డబ్బు గురించి ఇప్పుడే చెబితే..వారు పాడౌతారనీ అనుకుంటారు కొందరు. ఇవన్నీ గతం. పరిస్థితులు మారాయి. ఏది మంచి.. ఏది చెడు అని చెబితే అర్థం చేసుకుంటున్నారు నేటి తరం. పాఠశాలల్లో కూడా డబ్బుకు సంబంధించిన పాఠాలు నేర్పుతున్నారు. కాబట్టి, డబ్బుకు సంబంధించిన విషయాల గురించి నిరభ్యంతరంగా పిల్లల ముందు చర్చించవచ్చు. మీ కుటుంబ బడ్జెట్‌ రూపకల్పనలో వారినీ భాగస్వామి చేయండి. అంటే పిల్లలకు ఆ నెలలో ఏం కావాలో అడగండి. బడ్జెట్‌ అనుమతిస్తే కొనివ్వండి. లేదంటే ఎందుకు కొనలేకపోతున్నామో వివరంగా చెప్పండి. అప్పుడే వారికి మీరు ఎలా కష్టపడుతుంది, డబ్బు విలువ ఏంటో తెలిసి వచ్చేది.

* ఇప్పుడు డబ్బు నిర్వహణకు సంబంధించి ఆన్‌లైన్‌లోనూ, మొబైల్‌ యాప్‌ల్లోనూ ఎన్నో వేదికలు ఉన్నాయి. వాటిని ఎలా వాడాలో పిల్లలకు నేర్పించాలి. మీ రోజువారీ ఖర్చులను ఒక కాగితం మీదా రాసి, తర్వాత పిల్లలను యాప్‌లో రాసేలా చూడాలి. దీనివల్ల వారికి భవిష్యత్తులో డబ్బు నిర్వహణ ఎలా చేసుకోవాలో నేర్పించినట్లు అవుతుంది. అయితే, మీ బ్యాంకు ఖాతా, కార్డు వివరాలను మాత్రం పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి.

మీరూ జాగ్రత్తగా ఉండాలి
డబ్బును మనం ఎలా ఖర్చు చేస్తున్నామన్న తీరు పిల్లలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. పిల్లలు సాధారణంగా తల్లిదండ్రులను అనుకరిస్తారు. కాబట్టి, పిల్లల ముందు ఖర్చు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకూ చిన్న నోట్లను అంటే రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను ఖర్చులకు వినియోగించాలి. అప్పుడు పిల్లలకు మనం తక్కువ ఖర్చు చేస్తున్నామనే భావన కలుగుతుంది. వారూ అలాగే చేయడానికి అలవాటుపడతారు. మీరు నిర్లక్ష్యంగా ఖర్చు చేస్తే.. పిల్లల్లోనూ అదే ధోరణి వచ్చే ప్రమాదం ఉంది.

ఎందుకో చెప్పాలి!
ఎందుకోసం పొదుపు చేస్తున్నామో పిల్లలకు వివరించలేకపోతే వారిలో ఉత్సాహం ఉండదు. అందుకే లక్ష్యాన్ని నిర్దేశించాలి. వారు చేస్తున్న పొదుపు వారి ఖర్చుల కోసమే అని వివరించాలి. పాఠశాల నుంచి విహార యాత్రలు, మిత్రులకు పుట్టిన రోజు బహుమతులు ఇవ్వడం, నచ్చిన ఆట వస్తువు కొనడం ఇలా ఏదో ఒక లక్ష్యంతో వారిని పొదుపు చేసేలా ప్రోత్సహించాలి.

* పొదుపు నేర్పే క్రమంలో వారు మరీ పొదుపరులు కాకుండా జాగ్రత్తపడాలి.

మీ వంతుగా…
* పిల్లల చదువులను, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రారంభించాలి. పీపీఎఫ్‌, మ్యూచువల్‌ ఫండ్లను ఇందుకోసం పరిశీలించవచ్చు.

* పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ రాకుండా మీ పేరుపై తగిన మొత్తానికి జీవిత బీమా ఉండేలా చూసుకోండి.

డబ్బు విలువను తెలియజేయడానికి కొన్ని మార్గాలను అనుసరించవచ్చు.

  • అంకెలను లెక్కించడం ప్రారంభించిన వెంటనే పిల్లలకు డబ్బును పరిచయం చేయండి.
  • ఖర్చుల కోసం పిల్లలకు చిన్నమొత్తాల్లో ఇవ్వండి. దేనికోసం ఆ డబ్బు ఇస్తున్నారో స్పష్టంగా తెలియపర్చండి.
  • అవసరానికి, కోరికకు మధ్య తేడాను వివరించండి. ఇలాచేయడం ద్వారా డబ్బు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకొని వృథా ఖర్చులను నివారించినవారమవుతాం.
  • ఏ సైకిలో లేదా ఖరీదైన బొమ్మనో కొనుక్కునేందుకు డబ్బును పొదుపు చేయమని లక్ష్యాన్ని విధించండి. వారు జమచేసిన దాంట్లోంచి కొంత సొమ్మును లక్ష్యం కోసం వెచ్చించడం ద్వారా పొదుపు ప్రాముఖ్యత తెలియజేసిన వారమవుతాం.
  • ఖర్చు కంటే పొదుపు ఎలా చేయాలో నేర్పించండి. గల్లాపెట్టెలో దాచుకున్న డబ్బుకు కొంత సొమ్ము వడ్డీలా జతచేస్తున్నామని చెప్పి వారిని పొదుపుచేసే దిశగా ప్రోత్సహించండి. దీంతో వాళ్లకు వడ్డీ ప్రాముఖ్యత తెలిసివస్తుంది.
  • కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్లకోసం ఓ బ్యాంకు ఖాతా తెరిపించండి. నగదు లావాదేవీలు ఎలా జరుగుతాయో వివరించి చెప్పండి. వాళ్లు పొదుపు చేసుకున్న దాంట్లోంచి కొంత సొమ్మును ఏదైనా వస్తువు కొనుక్కునేందుకు తీసుకోవాల్సి వస్తే వారిని నిరాశపర్చకండి. దీంతో అసలుకే మోసం అన్నట్టు పొదుపుపైనే ఆశ పోతుంది.
  • అవసరమైనదైనా, అనవసరమైన వస్తువేదైనా కొనుగోలు నిర్ణయాన్ని పిల్లల ఇష్టానికే వదిలేయండి. ఆ తర్వాత కొన్న వస్తువుపై, ఇకపై చేసే కొనుగోళ్లపై విశ్లేషించమనండి. వాళ్లకవసరమైన వస్తువులు ఎక్కడ ఉంటాయో, మంచి నాణ్యత, తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకోమనండి. బేరమాడేందుకు వీలుంటే చేసేలా ప్రోత్సహించండి. వివిధ ప్రదేశాల్లో ధరల్లో తేడాలను గమనించమనండి. దీని వల్ల పిల్లల్లో ఎక్కువ వస్తువులను కొనుగోలుచేయాలనే ఆలోచన తగ్గుతుంది.
  • చిన్న వయసులో చిన్న పొరపాట్లు పెద్దయిన తర్వాత పెద్ద తప్పులు చేయకుండా నిలువరిస్తుంది.
  • కొంత డబ్బు పిల్లల చేతికిచ్చి సూపర్‌మార్కెట్లో ఎన్ని ఎక్కువ వస్తువులు వీలైతే అంత కొనమని ఛాలెంజ్‌ చేయండి. లేదా కొనాల్సిన సరుకుల లిస్టును వాళ్ల చేతికిచ్చి ఒక్కోదానికి ఎంత ఖర్చు అయ్యిందో లెక్కవేయమనండి. వివిధ చోట్ల తిరిగి వస్తువులు ఎక్కడ తక్కువకు లభిస్తాయో తెలుసుకోవడం వల్ల పిల్లలకు ధరలను పోల్చి చూడడంలో నైపుణ్యం పెరుగుతుంది.
  • సరైన వస్తువును కొనుగోలు చేసేందుకు వారికి పూర్తి స్వేచ్ఛనివ్వండి. ఎక్కువ సంతృప్తినిచ్చేది అవసరమైన వస్తువునే కొనమనేలా ప్రోత్సహించండి. సదరు వస్తువు ఎందుకు కొనుగోలు చేశారు, ఎందుకు చేయలేదు అని అడగండి. ఇప్పుడే కొనాలా లేక తర్వాతైనా కొనుక్కునే వీలుందా కనుక్కోండి. ఇదే వస్తువు వేరే ఎక్కడైనా తక్కువ ధరకు దొరుకుతుందేమో పిల్లల్ని అడిగి తెలుసుకోమనండి.
  • వస్తుమార్పిడిని ప్రోత్సహించండి. ఈ పద్ధతి ద్వారా డబ్బు లేకపోయినా మంచి వస్తువులను ఎలా సొంతం చేసుకోవచ్చో వివరించండి.
  • పాకెట్‌ మనీ ఇస్తున్నాం కదా అని పనిచేయించుకుంటున్నారన్న భావన పిల్లల్లో కలగనీయకండి. మీరు అప్పజెప్పే పనులు కుటుంబ బాధ్యతలు అనుకునేలా చేయండి.
  • పిల్లలు అడిగినప్పుడు డబ్బు చేతికందించకుండా అందుకు ఓ రోజును కేటాయించండి. ఇచ్చిన డబ్బు ఎన్ని రోజులకు సరిపోతుంది. ఎంత మేరకు మిగుల్చుకోగలుగుతారు అనే విషయాన్ని అడిగి తెలుసుకోండి.
  • సరైన అవగాహన కల్పిస్తే పిల్లలకు స్వల్పకాల, దీర్ఘకాల పెట్టుబడుల్లో తేడాను గమనించగలుగుతారు. చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించండి. పొదుపు చేసిన డబ్బుతో బొమ్మనో, వీడియో గేమ్‌ లేదా సైకిల్‌ కొనమని చెప్పండి.
  • గల్లాపెట్టెలో వారు జమచేసిన సొమ్మును లెక్కచేసి వాళ్లు అనుకున్న లక్ష్యానికి ఎంత చేరువలో ఉన్నారు అన్న విషయాన్ని అడిగి మెచ్చుకోండి.
  • పిల్లలు తమకు ఇచ్చేదాని కంటే ఒక్కోసారి అవసరమై ఎక్కువ డబ్బులు అడుగుతారు. ఎంత డబ్బు ఎక్కువ ఇస్తున్నారో అంత మేరకు రాబోయే నెలలో కోత విధించండి. దీనికి అదనంగా కొంత వడ్డీ విధించండి. ఇలా చేయడం వల్ల అప్పు తీసుకోవడం తమ హక్కుగా కాకుండా బాధ్యతగా తీర్చాలనేది వారి మనసులో నిలిచిపోతుంది.
  • పాకెట్‌ మనీ విషయంలో రాజీ కుదుర్చుకునేలా చేయండి. మీరూ వారితో రాజీ కుదర్చుకునేందుకు చూడండి. ఇది భవిష్యత్తులో వాళ్ల స్నేహితులతో, ఉద్యోగంలో చేరడానికో బాగా ఉపయోగపడుతుంది.
  • షాపింగ్‌ చేసేటప్పుడు రుసుములు ఎలా ఉంటాయి. వాటిపై సేవా, వస్తు పన్నులు ఏ విధంగా ఉంటాయో వివరించండి.
  • వాళ్లకో ప్రీపెయిడ్‌ క్రెడిట్‌ కార్డు ఇచ్చి వాళ్ల ఖర్చులను ట్రాక్‌ చేస్తూ ఉండండి. కార్డు వాడకం అలవాటయ్యాక సాధారణ క్రెడిట్‌ కార్డును ఇచ్చి గడువు తేదీలోపు వడ్డీ చెల్లించేలా చూడండి.
  • డబ్బు ఉపయోగించడంలో మంచి అనుభవం వచ్చాక వాళ్లను పెట్టుబడి మార్గాలకు పరిచయంచేసి వడ్డీ పొంది లాభపడేలా చూడండి.
  • సాధారణ బ్యాంకు, పోస్టాఫీసు డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను పరిచయం చేయండి. తర్వాత తర్వాత స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు, అందులో నష్టలాభాలను వివరించండి. మ్యూచువల్‌ ఫండ్లు, ఇండెక్స్‌ ఫండ్ల గురించి చెప్పండి.
  • ఇంటర్నెట్‌లో లభించే పెట్టుబడికి సంబంధించిన ఆటలను ఆడమని ప్రోత్సహించండి.

మంచి కెరీర్‌కు బలమైన పునాది అవసరం. ఆర్థిక విషయాల్లోనూ అంతే. సంప్రదాయ సబ్జెక్టులైన చరిత్ర, జాగ్రఫీ, సైన్సు మనకెంత వరకు ఉపయోగపడతాయో చెప్పలేం కానీ ఆర్థిక పాఠాలు మాత్రం చక్కని ఆర్థిక జీవితాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు.

Comments

comments

Recent Posts