news

‘అజ్ఞాతవాసి’కి షాక్ ఇచ్చిన కేసీఆర్ గవర్నమెంట్.. నో పర్మిషన్, థియేటర్లకు నోటీసులు!!

వ్రతం చెడినా ఫలితం దక్కలేదంటే ఇదే… జనవరి 1వ తేదీన పని కట్టుకుని వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. దేశంలో 24 గంటలు పవర్ ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ దే అంటూ ఢంకా బజాయించారు. అంతేకాదు రాష్ట్రపతి రాక సందర్భంగా గవర్నర్ నరసింహన్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలోనూ కేసీఆర్, పవన్ రహస్య మంతనాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇక అజ్ఞాతవాసి సినిమాకు ప్రీమియర్ షోల పర్మిషన్ల కోసం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్…. తెలంగాణా ప్రభుత్వ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సైతం కలిసి మంతనాలు సాగించారు. అయినా సరే ఏ ఫలితం లేకుండా పోయింది.

‘అజ్ఞాతవాసి’ చిత్రానికి తెలంగాణ పోలీసు అధికారులు షాకిచ్చారు. ఈ చిత్రం ప్రీమియర్ షోలను ప్రదర్శించుకునేందుకు అనుమతి కావాలని నిర్మాతలు అడుగగా, పోలీసు ఉన్నతాధికారులు నిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్థరాత్రి తరువాత ప్రీమియర్ షోలు వేసుకునేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. ప్రీమియర్ లకు అనుమతి ఇస్తే, అభిమానుల మధ్య తొక్కిసలాటలు జరిగే అవకాశాలు ఉన్నాయని, గతంలో ఇటువంటి ఘటనలను చూశామని, అన్ని థియేటర్ల వద్దా బందోబస్తు సాధ్యం కాదని అభిప్రాయపడ్డ ఉన్నతాధికారులు, ప్రీమియర్ లకు ఓకే చెప్పేది లేదని నిర్మాతలకు సమాచారం ఇచ్చారు.

కాగా, ఏపీ సర్కారు రోజుకు ఏడు ఆటలను ప్రదర్శించుకునేలా వారం రోజుల పాటు పవన్ కల్యాణ్ చిత్రానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 24 గంటలూ షోలు నడుస్తాయన్నమాట ఆంధ్రాలో… ఇటీవల కేసీఆర్ ను స్వయంగా కలిసిన పవన్, ప్రత్యేక షోలకు అనుమతి కోరినట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకో కాని ఈ విషయంలో సుముఖంగా లేదు. సినిమా ఎలా ఉన్నా ఏడు రోజుల సంక్రాంతి పండుగ హడావుడిలో సినిమాకు పెట్టిన డబ్బు మొత్తం రాబట్టొచ్చని సినిమా నిర్మాణ సంస్థ ఆలోచనగా కనిపిస్తోంది.

కాని ఓ ప్రభుత్వం సహకరించి, మరో ప్రభుత్వం మొండిచేయి ఇచ్చేసరికి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లోకి చిత్ర బృందం వెళ్లింది. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈరోజు రాత్రి కల్లా తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు పర్మిషన్లు ఇస్తారని ఆశతో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణా వ్యాప్తంగా టిక్కెట్లు కొనుక్కుని మరీ సినిమా ప్రీమియర్ షోల కోసం ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

Comments

comments