news

ప్రదీప్ కి శిక్ష ఏమిటంటే…?!!

‘తాగి వాహనం నడపడం తప్పే. నేను తప్పు చేశాను.’ అని టీవీ యాంకర్‌ ప్రదీప్‌ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తాగి వాహనం నడపడం వల్ల ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురువుతాయో, తమతో పాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్న వైనాన్ని కూడా తాను ప్రచారం చేస్తున్నానని వివరించాడు. అంతేకాదు గత నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన వీడియోలోనూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు ప్రదీప్. తాను తప్పు చేశానని, ఇంకెవరూ ఆపని చేయొద్దని సలహా కూడా ఇచ్చాడు.

డిసెంబరు 31న తాగిన మైకంలో పోలీసులకు చిక్కిన ప్రదీప్‌.. సోమవారం గోషామహల్‌ ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలో గంటసేపు జరిగిన కౌన్సెలింగ్‌కు తన తండ్రితో కలిసి హాజరయ్యాడు. ఇక ముందు అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ప్రదీప్‌ హామీ ఇచ్చినట్లు ట్రాఫిక్‌ అదనపు డీసీపీ అమర్‌కాంత్‌రెడ్డి తెలిపారు. కౌన్సెలింగ్‌ పూర్తయినందున, ఆయా విషయాలతో చార్జిషీట్‌ రూపొందించి కోర్టులో దాఖలు చేస్తామని, అతనికి జరిమానానా లేదా శిక్ష పడుతుందా? అన్న విషయాన్ని కోర్టు నిర్ధారిస్తుందని ఆయన వెల్లడించారు.

ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన కౌన్సిలింగ్ లో ప్రదీప్ బుద్దిగా ముందు వరుసలో కూర్చున్నారు. గంట పాటు ఈ కౌన్సిలింగ్ కొనసాగింది. మొత్తానికి ప్రదీప్ పశ్చాత్తాపంతో ఉన్నందున కోర్టు ఈ ఒక్కసారికి ఫైన్ వేసి వదిలిపెట్టొచ్చన్న చర్చ నడుస్తోంది. కాదు.. కాదు.. ఎవరో ఒక సెలబ్రిటీకి శిక్ష వేయడం ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో పోలీసులు, కోర్టులు సీరియస్ గా ఉన్నాయన్న మెస్సేజ్ ఇవ్వాలనుకుంటున్నారని విశ్లేషించే వాళ్లూ ఉన్నారు. కోర్టు కనుక అలా భావిస్తే ప్రదీప్ కు శిక్ష తప్పదు. ఏది ఏమయినా ఇక అంతిమ నిర్ణయం కోర్టుదే..

Comments

comments